Page Loader
Jharkhand assembly polls: కాంగ్రెస్-జేఎంఎం కూటమి 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ..  
కాంగ్రెస్-జేఎంఎం కూటమి 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ..

Jharkhand assembly polls: కాంగ్రెస్-జేఎంఎం కూటమి 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ..  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2024
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. 81 అసెంబ్లీ స్థానాలకుగానూ 70 చోట్ల ఈ రెండు పార్టీలు అభ్యర్థులను నిలబెడతాయని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వెల్లడించారు. "సీట్ల పంపకాలపై ప్రస్తుతం మరిన్ని వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదు. మా మిత్రపక్షాల నేతల సమక్షంలో సీట్ల సంఖ్యను ఫైనల్ చేసుకుంటాం" అని ఆయన మీడియాకు తెలిపారు. మిగతా 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

బీజేపీను ఓడించే సత్తా ఆర్జేడీకి ఉంది 

అయితే సోరెన్ ప్రకటనపై ఆర్జేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జేఎంఎం, కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయంటూ ఆర్జేడీ స్పందించింది. ఎన్నికల్లో పోటీ విషయంలో తమ ముందు అన్ని అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 15-18 స్థానాల్లో ఒంటరిగానే బీజేపీను ఓడించే సత్తా ఆర్జేడీకి ఉందని వ్యాఖ్యానించింది. జార్ఖండ్ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా, అదే నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

వివరాలు 

డీజీపీపై ఈసీ వేటు.. 

ఎన్నికల వేళ జార్ఖండ్ తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాపై ఎన్నికల సంఘం వేటువేసింది. తక్షణమే ఆయన్ను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.