Robert Vadra: హర్యానా ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. రాబర్ట్ వాద్రా పోస్ట్ వైరల్
హర్యానా రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో నిలిచింది. అయితే చివరికి బీజేపీ పుంజుకొని విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దానిని అంగీకరించాలని, వారు ఎంచుకున్న నాయకులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలని, దేశం గురించి కూడా ఆలోచించండి అంటూ వాద్రా పేర్కొన్నారు.
36 స్థానాలకు పరితమైన కాంగ్రెస్
హర్యానా ఎన్నికల కౌంటింగ్‌లో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న పోరులో బీజేపీ అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకుపోయింది. మొదట కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నా, తరువాత కమలం పార్టీ అధికారాన్ని సంపాదించేందుకు కీలకమైన మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం, బీజేపీ ప్రస్తుతం 47 స్థానాల్లో ఆధిక్యం పొందింది. కాంగ్రెస్ 37 స్థానాలకు పరిమితమైంది. దీంతో బీజేపీ విజయాన్ని సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల విజయంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం అనుకోని దెబ్బగా మారింది. ఈ సమయంలో వాద్రా పోస్ట్ తెరపైకి రాగా, అది వైరల్‌గా మారింది.