
ACP Son Murder: ఏసీపీ కొడుకు దారుణ హత్య.. కాలువలో విసిరేసిన మృతదేహం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఏసీపీ కుమారుడిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కుమారుడు లక్ష్యయ్ చౌహాన్ జనవరి 23 నుంచి కనిపించకుండా పోయాడు.
అతడి కోసం పోలీసులు ముమ్మరం వెతికినా.. ఎక్కడా కనిపించలేదు. దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చౌహాన్ స్నేహితులే.. అతన్ని కాల్వలోకి తోసి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
పానిపట్‌లోని మునక్ కాలువలోకి లక్ష్యయ్ చౌహాన్‌ను తోసి హత్య చేశారు. మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడు అభిషేక్‌ను కూడా అరెస్టు చేశారు. అభిషేక్ సహచరుడు వికాస్ భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
దిల్లీ
డబ్బులు విషయంలో ఇద్దరి మధ్య గొడవ
దిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ భరద్వాజ్ తీస్ హజారీ కోర్టులో ఒక లాయర్ దగ్గర క్లర్క్‌గా పనిచేస్తున్నాడు.
స్వతహాగా వృత్తిరీత్యా న్యాయవాది అయిన మృతుడు చౌహాన్.. వికాస్ భరద్వాజ్ నుంచి డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.
లక్ష్యయ్‌ను డబ్బు అడిగినప్పుడు, అతను వికాస్ భరద్వాజ్‌తో అనుచితంగా ప్రవర్తించాడు.
దీంతో వికాస్ తన స్నేహితుడు అభిషేక్‌తో కలిసి చౌహాన్ హత్యకు కుట్ర పన్నాడు.
జనవరి 22న చౌహాన్ తన బంధువుల్లో ఒకరి పెళ్లి కోసం భివానీకి వెళ్లాల్సి ఉంది. లక్ష్యయ్ కారులో వికాస్ తో పాటు అతని స్నేహితుడు అభిషేక్‌తో కలిసి భివానీకి వెళ్లాడు.
అర్థరాత్రి తిరిగి వస్తుండగా.. చౌహాన్‌ను వికాస్, అభిషేక్ మునక్ కెనాల్‌లోకి తోసేసి హత్య చేశారు.