మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి
హర్యానాలో చెలరేగిన హింస రావణకాష్టంలా మారుతోంది.తాజాగా అల్లరి మూకలు నుహ్‌లో ఓ కారుకు నిప్పు అంటించారు. అయితే సదరు కారులో మహిళా న్యాయమూర్తి, ఆమె కుమార్తె ప్రయాణిస్తున్నారు.ఈ క్రమంలోనే వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మహిళా అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంజలి జైన్,తన కుమార్తెతో ప్రయాణిస్తున్న కారుకు దుండగులు నిప్పంటించారు.ఘటనలో ఇరువురూ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఓ గుంపు వీరి కారుపై రాళ్లు రువ్వుతూ కాల్పులు జరిపారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించికున్నట్లు నుహ్ ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది. దుండగుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓల్డ్ బస్టాండ్‌లోని ఓ వర్క్ షాప్‌లో కొద్ది సేపు వేచి ఉన్నారు. తర్వాత పలువురు లాయర్లు వీరిని కాపాడినట్లు సమాచారం.
మందులు కొనేందుకు వెళ్తే కారును తగలబెట్టారు
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అంజలీ జైన్ తన కుమార్తెతో పాటు అంగరక్షకుడితో కలిసి వోక్స్ వ్యాగన్ కారులో మందులు కొనేందుకు నల్హర్‌లోని SKM వైద్య కళాశాలకు వెళ్లారు. 2 గంటలకు తిరిగి వస్తుండగా దిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో 150కిపైగా అల్లరి మూకలు వారిపై రాళ్లు రువ్వుతూ దాడికి పూనుకున్నాయి. ప్రాణాల కోసం బాధితులు పరుగెత్తారు. దీంతో కారును అల్లరి మూకలు తగులబెట్టినట్లు FIRలో పొందుపర్చారు. ఘటనలో పాల్గొన్న నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపును అడ్డగించే క్రమంలో నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడలేకపోవడం ఆందోళనకరంగా మారింది.
నిందితులను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు
Accused arrested by the Police in connection with the recent violence in Nuh, Haryana being taken to the Court. pic.twitter.com/wZ3rmGFzDy— ANI (@ANI) August 3, 2023