
MK Stalin: త్వరగా పిల్లల్ని కనండి.. తమిళ ప్రజలకు సీఎం విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు గుప్పిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయిస్తే, రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంశంపై మాట్లాడుతూ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా పెంచుకోవాలని సీఎం విజ్ఞప్తి తమిళనాడు ప్రజలకు ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ, "గతంలో నేను కొత్తగా పెళ్లయిన దంపతులను కుటుంబ నియంత్రణ పాటించాలని ప్రోత్సహించా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడు నష్టపోకుండా ఉండాలంటే, కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లల్ని కనాలి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టాలని ఆయన అన్నారు.
Details
నియోజకవర్గాల తగ్గుదలపై ఆందోళన
ఇటీవల కొళత్తూర్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలోనూ స్టాలిన్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. "కుటుంబ నియంత్రణ ద్వారా పరిమితంగా పిల్లలను కని, సంపదతో జీవించాలని భావించాం. కానీ దీని వల్ల రాబోయే రోజుల్లో పునర్విభజన సమయంలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి పిలుపు ఈ సమస్యపై చర్చించేందుకు స్టాలిన్ ఈనెల 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 40కి పైగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు.
Details
8 లోక్‌సభ స్థానాలు తగ్గే ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం 2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. జనాభా ప్రాతిపదికన ఇది అమలైతే తమిళనాడుకు 8 లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుందని తెలుస్తోంది.