Page Loader
HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం
హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం

HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమె మంత్రి వర్గ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. హెచ్‌సీయూ భూముల విషయంలో తాజా పరిణామాలను చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో సమావేశం కానున్నారు.

Details

విద్యార్థి నాయకులతో చర్చలు

విద్యార్థి ఉద్యమాల ప్రతినిధులతో చర్చలు జరిపి భూముల వివాదంపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టంగా సమీక్షించనున్నారు. ఇక కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్‌సీయూ భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి మధ్య కీలక సమావేశం జరిగింది. ఇప్పటికే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్న మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఇప్పటికే కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.

Details

పర్యావరణ కార్యకర్తలతో భేటీ

దీనికి అనుగుణంగా సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, అటవీ, హెచ్ఎండీఏ వంటి శాఖల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్షా సమావేశాలు నిర్వహించారు. త్వరలో విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలతో కమిటీ భేటీ కానుంది. ఈ నెల 16లోపు నివేదికను సమర్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో సీఎస్ నివేదిక సిద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు కంచ గచ్చిబౌలిలో ఎకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ప్రాంత అభివృద్ధితోపాటు భూవివాదాలకు శాశ్వత పరిష్కారం దొరకొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.