Loading...
Udhayanidhi: ఉదయనిధి కాదు 'వల్గర్-నిధి' అంటూ టీవీకే ఫైర్
ఉదయనిధి కాదు 'వల్గర్-నిధి' అంటూ టీవీకే ఫైర్

Udhayanidhi: ఉదయనిధి కాదు 'వల్గర్-నిధి' అంటూ టీవీకే ఫైర్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి త్రిషను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో జరిగిన పరిణామాల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిషను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ'తమిళగ వెట్రి కళగం'(టీవీకే) పార్టీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ వివాదానికి కారణమైన ఘటన సోమవారం తంజావూరులో కావేరి జలాల సమస్యపై నిర్వహించిన నిరసన సభలో చోటుచేసుకుంది. సభలో ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి విమర్శలు చేస్తుండగా, అక్కడున్న కొందరు కార్యకర్తలు 'త్రిష... త్రిష' అంటూ నినాదాలు చేశారు.

వివరాలు 

ఉదయనిధి వ్యాఖ్యలు తమిళనాడులోని మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయి 

దాంతో ఆయన కాసేపు ప్రసంగాన్ని నిలిపివేసి చిరునవ్వుతో స్పందిస్తూ ద్వంద్వార్థం వచ్చేలా అభ్యంతరకర వ్యాఖ్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది.

ఉదయనిధి అరెస్ట్ అనంతరం టీవీకే పార్టీ విమర్శలను మరింత ఉధృతం చేసింది.

పార్టీ నేత అమెరికై నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

"ఆయన పేరు ఉదయనిధి కాదు.. 'వల్గర్-నిధి'. తన పేరును అలాగే మార్చుకోవాలి" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఆయనను అరెస్ట్ చేయలేదని, ఒక మహిళను అవమానించేలా మాట్లాడినందుకే పోలీసులు చర్యలు తీసుకున్నారని అన్నారు.

ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు త్రిషను మాత్రమే కాకుండా తమిళనాడులోని మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు.

వివరాలు 

జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన టీవీకే

ఈ ఘటనపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది.

అనంతరం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందించడంతో కేసు నమోదు చేసి ఉదయనిధిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకెళ్తున్న సమయంలో ఉదయనిధి నవ్వుతూ కనిపించారు.

తన అరెస్ట్‌ను ఒక 'జోక్'గా అభివర్ణించిన ఆయన, ఈ వ్యవహారంపై న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ వివాదంపై స్పందించారు.

ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు మహిళలను కించపరిచేలా లేదా చులకనగా భావించేలా వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ADVERTISEMENT