
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో మొదలైన కీలకఘట్టం.. టీహబ్‌లో 'హెడ్ టు హెడ్ ఛాలెంజ్'
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అందాల పోటీ 'మిస్ వరల్డ్'లో కీలకమైన ఘట్టం ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని టీ హబ్ వేదికగా ఈ పోటీకి సంబంధించి రెండురోజుల పాటు కాంటినెంటల్ ఫినాలే నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 'హెడ్ టు హెడ్ ఛాలెంజ్' పేరుతో జరిగే ఈ ప్రత్యేక పోటీలో తొలిరోజు అమెరికా-కరేబియన్, ఆఫ్రికా ఖండాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు.
ఈ పోటీకి 'బ్యూటీ విత్ ఏ పర్పస్' అనే సామాజిక అంశం ప్రధానంగా నిలిచింది.
బుధవారం నాడు యూరప్, ఆసియా-ఓషియానియా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు.
వివరాలు
పర్యావరణ పరిరక్షణ, మెరుగైన సమాజ నిర్మాణంపై చర్చ
మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అందాల భామలు సామాజిక సేవా కార్యక్రమాలపై తమ ప్రణాళికలను వివరించారు.
ముఖ్యంగా పేద పిల్లల విద్య,వృద్ధుల మానసిక ఆరోగ్యం,మహిళా సాధికారత,భాషల పరిరక్షణ వంటి విభిన్న అంశాలపై చర్చించారు.
పర్యావరణ పరిరక్షణ, మెరుగైన సమాజ నిర్మాణం కోసం తమ దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేశారు.
మిస్ అర్జెంటీనా గ్వాడాలుపే అలోమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని, వారి చదువు, దైనందిన అవసరాల కోసం హెల్ప్‌సెంటర్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నట్లు తెలిపారు.
బెలిజ్ సుందరి షాయరీ మోరతాయా పిల్లల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో ఒక ఇంగ్లీష్ టీచర్‌గా చిన్నారుల మంచి విద్య కోసం పాటుపడుతున్నట్లు వివరించారు.
వివరాలు
పర్యావరణ పరిరక్షణకు ఓల్గా చావెజ్ తన వంతు సహాయం
బొలీవియా దేశానికి చెందిన ఓల్గా చావెజ్ తనే స్వయంగా ఐదువేల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ దాదాపు 20మంది పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు వివరించారు.
చిలీ అందాల భామ ఫ్రాన్సిస్కా లావండెరో ఒంటరిగా జీవించే వృద్ధుల మానసిక సమస్యలను తేలిక చేయడానికి ప్రత్యేక ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మైరా డెల్గాడో మహిళల సాధికారత కోసం,పిల్లల్లో నాయకత్వ లక్షణాల పెంపొందింపుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అమెరికా నుంచి పాల్గొన్న అథెన్నా క్రాస్బీ తన సోదరుడు వైకల్యంతో బాధపడిన అనుభవంతో, అటువంటి సమస్యలతో జీవించే ఇతరులకు సహాయపడే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వివరాలు
యువతుల కథలు తనకు ప్రేరణ: జూలియా మోర్లే
ఈ సందర్భంగా మిస్ వరల్డ్ సంస్థ చైర్మన్ జూలియా మోర్లే మాట్లాడుతూ, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ కేవలం పోటీ మాత్రమే కాకుండా, ఇది ధైర్యానికి, దయకు, సంకల్పానికి గుర్తుగా నిలుస్తుందని అన్నారు.
ఈ యువతుల కథలు తనకు ప్రేరణను కలిగించాయని తెలిపారు.