YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ (CBI), ఈడీ (ED)కి వై.ఎస్.జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను సమర్పించమని ఆదేశించింది. ఈ వివరాలు రెండు వారాల్లోగా అందించాలని కోరింది. అలాగే, కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు కూడా సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్ల వివరాలను కూడా అందించాలని సూచించింది. కేసుల వివరాలను విడివిడిగా చార్ట్ రూపంలో సమర్పించాలి, అఫిడవిట్లతో కలిసి రెండు వారాల్లోపు అన్ని వివరాలు దాఖలు చేయాలని ఆదేశించింది.
విచారణ ఇంతకాలం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించిన ధర్మాసనం
అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యంగా కొనసాగుతున్నట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గతంలో పిటిషన్ వేశారు. కేసు విచారణ ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సమయంలో,ఇరుపక్షాల న్యాయవాదులు ఇప్పటికే రోజువారీ విచారణకు ఆదేశాలు ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాగా,కేసు విచారణ ఇంతకాలం ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్,వాయిదా పిటిషన్లు,ఉన్నత కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణలే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అంశాల కారణంగానే విచారణ ఆలస్యంగా సాగుతోందని వివరించారు.ఇవి పూర్తి వివరాలతో సమర్పిస్తే తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.