రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ మణిపూర్ దారుణ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మరోవైపు మణిపూర్ అంశంపై చర్చలకు రూల్ 267 (Rule 267) కింద సభా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయాలని విపక్షాలు భీష్మించాయి.ఏదైనా ఒక అంశంపై సుదీర్ఘంగా చర్చించేందుకు రూల్ 267 వాయిదా తీర్మానం జారీ చేస్తారు. మణిపూర్ ఘటనపై చర్చలకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పినా రూల్ 267 కింద చర్చలకు సిద్ధంగా లేనట్లు సమాచారం.కేవలం రూల్ 176 (Rule 176) కింద మాత్రమే సదరు సబ్జెక్ట్ పై చర్చించేందుకుే సుముఖంగా ఉంది.
రూల్ 267 కింద చర్చ చేయాలి, రూల్ 176 ప్రకారం కాదు : విపక్షాలు
రాజ్యసభలో రూల్ 176 కింద వాయిదా తీర్మానాల గురించి చైర్మెన్ ప్రకటన చేస్తున్న సమయంలో కొందరు విపక్ష సభ్యులు అడ్డుకున్నారు.రూల్ 267 కింద చర్చ చేయాలని,రూల్ 176 ప్రకారం కాదని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఒక అంశంపై సుదీర్ఘంగా ప్రభుత్వాన్ని నిలదీసి, దానికి స్పందించాలని విపక్షాలు భావిస్తే,అందుకు రూల్ 267 ఒక్కటే మార్గం. రూల్ 176 ప్రకారం కేవలం రెండున్నర గంటలు మాత్రమే చర్చించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రూల్ కింద ఎలాంటి తీర్మానాలు కానీ ఓటింగ్ లు కానీ ఉండవు. మరోవైపు పార్లమెంట్ లో మణిపూర్ ఘటనపై ఎందుకు ప్రకటన చేయట్లేదని మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన మణిపూర్ సీఎంను ఎందుకు భర్తరఫ్ చెయ్యలేదన్నారు.