మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు: పోరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారుల నియామకం
మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. దీంతో మణిపూర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్‌లోని కోహిమ, అస్సాంలోని సిల్చర్ నుంచి ఇద్దరు డీఐజీ స్థాయి అధికారులను మణిపూర్‌కు పంపించారు. ఇప్పటికే 5వేల మంది సీఆర్‌ఫీఎఫ్ జవాన్లను అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా సీఆర్‌పీఎఫ్ కార్యకలాపాలను నిర్వహించే పరిధులను పునర్ వ్యవస్థీకరించారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ అధికారులను తరలించి బాధ్యతలు అప్పగించారు. పునర్ వ్యవస్థీకరణ చేసిన పరిధిలోని సీఆర్‌పీఎఫ్ కార్యకలాపాలను నూతన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ డీజీ సుజయ్ లాల్ థోసెన్ కేంద్ర హోంశాఖతో మాట్లాడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించనున్న అధికారులు
ఇది పూర్తిగా అసాధారణ పరిస్థితి అని గతంలో ఇక్కడ కేవలం ఆరు కంపెనీల సీఆర్‌పీఎఫ్ దళాలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 57 కంపెనీలు విధులు నిర్వహిస్తాయని, ఈ కొత్త అధికారులు ఆరు నెలలపాటు విధులు చేపడతారని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. నాగాలాండ్‌లోని కోహిమ, అస్సాంలోని సిల్చర్ నుంచి డీఐజీ స్థాయి అధికారులు బాధ్యతలను నిర్వహించనున్నారు. మణిపూర్ లో మే3న రెండు తెగల మధ్య మొదట హింసాత్మక ఘటన చెలరేగింది. అయితే ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురు నిందితులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు.