Telangana: మూడు రోజులుగా భారీ వర్షాలు.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి.
శనివారం, ఆదివారం భారీ వర్షాల అనంతరం సోమవారం వర్షం తగ్గినా, వాతావరణం ముసురు కొనసాగుతూనే ఉంది.
సోమవారం రాత్రి 9 గంటల వరకు నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
వాయుగుండం అల్పపీడనంగా మారుతుందని, తదుపరి మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వివరాలు
హుస్సేన్ సాగర్ వరద
హుస్సేన్ సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. పికెట్, కూకట్పల్లి నాళాల నుంచి పెద్దమొత్తంలో నీరు చేరడంతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి స్థాయిని మించింది. అధికారులు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8,52,240 క్యూసెక్కులుగా కొనసాగుతుండగా, గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితి
ఖమ్మం జిల్లా మున్నేరు వాగు వద్ద వరద తగ్గుముఖం పడుతోంది. వరద నీరు 36 అడుగుల నుంచి 11 అడుగులకు తగ్గింది. ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.
వివరాలు
మిడ్ మానేరు ప్రాజెక్ట్
మిడ్ మానేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. 46433 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.52 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది.
జూరాల ప్రాజెక్టు
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. 40గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1045 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1042.323 ఫీట్లుగా ఉంది.
సింగూరు ప్రాజెక్టు
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇన్ ఫ్లో- 24845 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో- 401 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.ప్రస్తుత నీటి మట్టం- 20.531 TMC లు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం- 29.917 TMC లుగా కొనసాగుతుంది.