Power consumption: భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు రోజువారీ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. శుక్రవారం మరోసారి అత్యధిక డిమాండ్ నమోదైంది.
నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు డిస్కంలు భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్)లో భారీ స్థాయిలో విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాయి.
గత డిసెంబరు 1 నుంచి ఈ నెల 3 వరకూ 65 రోజుల్లో మొత్తం 5,405.23 మిలియన్ యూనిట్ల (మి.యూ.) కరెంటును కొనుగోలు చేశాయి.
ఒక్కోరోజు అధిక డిమాండ్ సమయాల్లో యూనిట్‌కు రూ.10 వరకూ చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత డిసెంబరులో రాష్ట్రంలో మొత్తం 7,292.69 మి.యూ. విద్యుత్తు సరఫరా కాగా, అందులో 37.39% (2,726.40 మి.యూ.) విద్యుత్తును ఎక్స్ఛేంజీలో కొనుగోలు చేశారు. జనవరిలో 30.78% విద్యుత్తు కొనుగోలు జరిగింది.
Details
నివేదిక సమర్పించిన డిస్కంలు
డిసెంబరులో రోజుకు సగటున 91.51 మి.యూ., జనవరిలో 83.59 మి.యూ. విద్యుత్తును డిస్కంలు కొన్నారు.
ఫిబ్రవరిలో 1,000 మి.యూ., మార్చిలో 1,046 మి.యూ. విద్యుత్తును కొనుగోలు చేయాల్సి ఉంటుందని డిస్కంలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యుత్తు సరఫరా కోసం డిస్కంలు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాయి.
అయితే వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో ఎక్స్ఛేంజీలో తాత్కాలికంగా తక్కువ రేట్లకు విద్యుత్తు లభిస్తున్నపుడు అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు.
ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, ఈ సమయాల్లో ఎక్స్ఛేంజీలో అధిక ధరలకు కూడా కొనాల్సిన పరిస్థితి ఉంది.
Details
డిస్కంలపై భారీ భారం
ఒక్కో పావుగంట స్లాట్‌కు విద్యుత్తు ధర మారుతూ ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉన్నపుడు యూనిట్ ధర గరిష్ఠంగా రూ.10కి చేరుతుండగా, లేని సమయంలో రూ.2 నుంచి రూ.3కే లభిస్తోంది.
గత నెలలో మొత్తం 2,591 మి.యూ. విద్యుత్తును కొనుగోలు చేశారు. ఇందులో డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో 1,190 మి.యూ. విద్యుత్తును అధిక ధరలకు కొనుగోలు చేయగా, మిగతా 1,401 మి.యూ. విద్యుత్తును తక్కువ ధరలు ఉన్న సమయంలో కొనుగోలు చేశారు.
ఫలితంగా నెల మొత్తం సగటు కొనుగోలు ధర రూ.3.83గా నమోదైంది.
రోజుకు కనీసం రూ.40 కోట్ల వరకు చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేయడం వల్లనే రాష్ట్రంలో నిరంతర సరఫరా కొనసాగుతోంది.
Details
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్
శుక్రవారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్ 16,293 మెగావాట్లు నమోదైంది. ఈ నెలలో ఇది నాలుగోసారి అత్యధిక డిమాండ్ నమోదు కావడం గమనార్హం.
గతేడాది మార్చి 8న 15,623 మెగావాట్లు డిమాండ్ నమోదై రికార్డు సృష్టించగా, ఈ నెల 5న 15,820 మెగావాట్లు నమోదై ఆ రికార్డును అధిగమించింది. అలాగే ఈ నెల 10, 19 తేదీల్లోనూ మరోసారి రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదైంది.
తాజాగా శుక్రవారం మళ్లీ 16,293 మెగావాట్లకు చేరింది. సాధారణంగా ఏటా మార్చిలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్ నమోదవుతుండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయికి చేరడం విశేషం.
దీంతో డిస్కంలు అప్రమత్తమై విద్యుత్తు కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి.