
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణకు హెవీ రేన్ అలర్ట్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇవాళ (మంగళవారం) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
Details
హైదరాబాద్‌లో భారీ వర్షాలు
హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో నగర వాసులు ఉలిక్కిపడుతున్నారు. కొన్ని రోజుల్లో కురిసిన వర్షాలు నాలాలు ఉప్పొంగి ప్రమాదాలు జరిగాయి. ఆదివారం కురిసిన వర్షాలకు ఆసిఫ్‌నగర్‌లో ఇద్దరు, ముషీరాబాద్‌లో ఒకరు గల్లంతయ్యారు. అఫ్జల్‌సాగర్ నాలాలో మామా, అల్లుడు కొట్టుకుపోయారు. వినోద్‌నగర్‌లో సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు. గచ్చిబౌలిలో గోడ కూలి మరొకరు మృతి చెందారు. మొత్తంగా, హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నలుగురి ప్రాణాలు బలితీసుకోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా భారీ వర్షాల హెచ్చరిక రావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Details
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇవాళ మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, సముద్రతీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అలాగే ఈ నెల 20 లేదా 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
Details
తెలంగాణ
తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.