
Heavy Rains in AP: ఏపీలో భారీ వర్షాల అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మళ్లీ ఆరంభమయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండగా, మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపటితో పాటు నాలుగు రోజుల వర్ష సూచన వాతావరణ శాఖ తాజా ప్రకారం, రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. తూర్పు తీరాన్ని వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు.
Details
పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ
భారీ వర్షాల కారణంగా అధికారులు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం (ఈరోజు) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. గురువారం (రేపు) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ కాగా, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
Details
చేపల వేటపై నిషేధం
అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించారు. మొత్తానికి వాతావరణ పరిణామాలు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.