LOADING...
AP Rains: బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం.. ఉత్తరాంధ్రలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం.. ఉత్తరాంధ్రలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

AP Rains: బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం.. ఉత్తరాంధ్రలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలు వర్ష విపత్తును ఎదుర్కొంటున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు నిరంతరంగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు,కాకినాడ,అనకాపల్లి,విజయనగరం జిల్లాల్లో వాగులు,నదులు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. విశాఖపట్టణం జిల్లా కాపులుప్పాడలో 16.1 సెం.మీ. వర్షపాతం నమోదవగా, గంభీరంలో 15.8, పరదేశిపాలెంలో 14.7,భీమునిపట్నం-మధురవాడలో చెరో 13.8,అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో 13.7,అనకాపల్లి జిల్లా చీడికాడలో 12.6, దేవరాపల్లిలో 12.2 సెం.మీ. వర్షం కురిసింది. ఉత్తరాంధ్రలోని 44 ప్రాంతాల్లో 10 సెం.మీ.కి పైగా వర్షం నమోదైంది.సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మారేడుమిల్లి (7.3 సెం.మీ.),సంతకవిటి (6.6 సెం.మీ.),ఆమదాలవలస (6 సెం.మీ.)ల్లో ఎక్కువ వర్షం నమోదైంది.

వివరాలు 

పొంగి ప్రవహిస్తున్న వాగులు 

అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1.83 లక్షల ఎకరాల పంటలు నీట మునిగాయని, వెయ్యి కిలోమీటర్లకుపైగా రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సుద్దగెడ్డ పొంగిపొర్లడంతో జగనన్న కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణిని పడవలో తరలించారు. అనకాపల్లి జిల్లాలో బీఎన్‌ రోడ్డులో తాచేరు వంతెనపై వరదనీరు ప్రవహించడంతో వడ్డాది-చోడవరం రాకపోకలు ఆగిపోయాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేపాడ మండలం సోంపురం వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి వరదతో ముంచెత్తగా, ఆదివారం రాత్రి ఆ మార్గంలో చిక్కుకున్న నలుగురిని ఎస్‌.కోట అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విశాఖలోని సింధియా వద్ద ఐఓసీ టెర్మినల్ నీట మునిగిపోవడంతో చమురు లోడింగ్ నిలిచిపోయింది.

వివరాలు 

వాగు దాటుతుండగా గల్లంతైన వ్యక్తి 

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో వర్షం ఉధృతమై ఇళ్లలోకి వరద నీరు చేరింది. హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన కుమారస్వామి (41) వాగు దాటుతుండగా వరదలో కొట్టుకుపోయాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శోధన కొనసాగిస్తున్నారు. చింతూరు-రామచంద్రపురం మధ్య జాతీయ రహదారిపై వాగు ఉద్ధృతి పెరగడంతో 50 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఐటీడీఏ ఏర్పాటు చేసిన పడవల ద్వారా ప్రయాణం కొనసాగుతోంది.

వివరాలు 

వరి, పత్తికి అధిక నష్టం 

ఎడతెరిపిలేని వర్షాలతో పొలాలు మునిగిపోయాయి. నాలుగైదు రోజులుగా మొక్కలు నీటిలోనే నిలిచిపోవడంతో వరి, పత్తి పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. 14 జిల్లాల్లోని 106 మండలాల పరిధిలో 828 గ్రామాలు వర్ష ప్రభావానికి గురయ్యాయి. సుమారు 1.83 లక్షల ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 1.59 లక్షల ఎకరాల వరి, 19 వేల ఎకరాల పత్తి దెబ్బతిన్నాయి. మినుము, పెసర, వేరుశనగ, కంది, మొక్కజొన్న, సజ్జ వంటి పంటలు కూడా కొంత మేర ముంపుకు గురయ్యాయి. గుంటూరు, బాపట్ల, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు సమాచారం.

వివరాలు 

రైళ్ల రద్దు.. మళ్లింపు 

కొత్తవలస-కిరండూల్ రైలుమార్గంలో జాగ్రత్త చర్యల భాగంగా విశాఖ-కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌ను రాయగడ మార్గంలో మళ్లించారు. విశాఖ-కిరండూల్ ప్యాసింజర్‌ను అరకు వరకు, కిరండూల్-విశాఖ ప్యాసింజర్‌ను కొరాపుట్ వరకు పరిమితం చేశారు. మంగళవారం ఈ రెండు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. మూడో నంబరు హెచ్చరిక కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టుల్లో మూడో నంబరు సిగ్నల్ కొనసాగుతోంది. ఈ నెల 24న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

గోదావరిలో నీటిమట్టం పెరుగుదల 

అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోశమ్మ ఆలయం వద్ద నీటిమట్టం పెరిగి ఆలయం నీట మునిగింది. డి.రావిలంక రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. సీతపల్లి వాగులో ఉధృతి పెరగడంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇదే సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, శబరి కలిసిపోవడంతో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని జలవనరులశాఖ తెలిపింది. పోలవరం స్పిల్‌వే వద్ద 31.15 మీటర్ల నీటిమట్టం నమోదు కాగా, 48 గేట్ల ద్వారా 6.89 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. ధవళేశ్వరం వద్ద మంగళవారం మొదటి హెచ్చరిక ఇవ్వబడే అవకాశం ఉంది.

వివరాలు 

శ్రీశైలానికి భారీ వరద ప్రవాహం 

జూరాల నుంచి 2,38,237 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 87,158, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. ప్రస్తుతం 10 గేట్ల ద్వారా 3,04,690 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా మరో 66,099 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 881.60 అడుగులు, నీటినిల్వ 197.01 టీఎంసీలుగా ఉంది.

వివరాలు 

నేడు తీరం దాటనున్న వాయుగుండం 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దిశగా కదులుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి గోపాలపురం సమీపంలో తీరం దాటుతుందని అంచనా. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది.