Cyclone Montha: పశ్చిమ బంగాళాఖాతంలో వేగంగా కదులుతున్న మొంథా తుపాన్.. తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ మరింత బలపడి, వేగంగా ముందుకు కదులుతోంది. గత ఆరు గంటల్లో ఇది గంటకు సుమారు 10 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగింది. ప్రస్తుతానికి తుపాన్ కేంద్రం మచిలీపట్నం నుండి సుమారు 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ తుపాన్ ఇవాళ రాత్రి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో నిరంతర వర్షాలు పడుతున్నాయి. తుపాన్ తీరం వైపుకు చేరువవుతున్న కొద్దీ దాని ప్రభావం మరింత పెరుగుతోంది.
వివరాలు
తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
ఈ నేపథ్యంలో తూర్పు తీర జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని ఆయన పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని,అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని సూచించారు. రేపు ఉదయం వరకు గుంటూరు,కృష్ణా,తూర్పు,పశ్చిమ గోదావరి,నెల్లూరు,శ్రీకాకుళం,విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాలు,ఒడిశా రాష్ట్రంలోని గజపతి,గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్)సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.
వివరాలు
శంషాబాద్‌కు రావాల్సిన 17 విమానాలను రద్దు
తుపాన్ తీవ్రత దృష్ట్యా కాకినాడ పోర్టుకు 10వ నంబర్ అత్యవసర ప్రమాద హెచ్చరికను విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం విడుదల చేసింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర వర్షాల కారణంగా రహదారులపై అనేక ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో నడుస్తున్న భారీ వాహనాలు రాత్రి 7 గంటలకల్లా పక్కకు ఆపాలని అధికారులు ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయం నుండి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ నుండి శంషాబాద్‌కు రావాల్సిన 17 విమానాలను కూడా రద్దు చేసినట్లు సమాచారం.