కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇప్పటికే ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
మరోవైపు ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో కేరళ సర్కార్ అప్రమత్తమైంది. ఎర్నాకులం, కన్నూర్, ఇడుక్కి, త్రిసూర్, కొట్టాయం, కాసర్ గోడ్ సహా ఆరు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.
ఈ మేరకు ఆయా జిల్లాల విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించింది. మంగళవారం ఒక్కరోజే ఇడుక్కి జిల్లా పీర్మాడేలో రికార్డు స్థాయిలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది.
DETAILS
హైరేంజ్ రోడ్లపై ప్రయాణాలు చేయవద్దు : కేరళ ముఖ్యమంత్రి విజయన్
కేరళలో భారీ వర్షాలతో వరద ముప్పు పొంచి ఉన్న కారణంగా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున హైరేంజ్ రోడ్లపై ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. బీచ్ లు , నదుల వద్దకు వెళ్లకూడదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తాజా పరిస్థితులపై రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు పలు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
DETAILS
కేరళ తీరప్రాంతాల్లో అల్లకల్లోలంగా మారిన సముద్రం
కేరళ తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి బలమైన గాలుల వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులలో చేపల వేటకు వెళ్లిన ఓ పడవ, సముద్రంలోనే బోల్తా పడింది.
కొల్లాం, అలప్పుజా, త్రిసూర్, కొట్టాయం, ఎర్నాకులం సహా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగడంతో విద్యుత్ సరఫరా స్థంభించింది.
మరోవైపు రోడ్లు, ఇళ్లు ధ్వంసం కాగా భారీ చెట్లు పడిపోయి కొల్లాం షెంకోట్టైలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్పందించిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి.
పంబా నది వదద్ నీటిమట్టం పెరిగి పతనంతిట్ట జిల్లా కురుంబన్ ముజిలో వందలాది గిరిజనులు వరదలో చిక్కుకుపోయారు. మీనాచిల్ నది భారీ ప్రవాహంతో కొట్టాయం నివాసితులు ఆందోళన చెందుతున్నారు.