బైడెన్ కోసం మూడెంచల భారీ భద్రత.. భారత రోడ్లపై పరుగులు తీయనున్న బీస్ట్
ప్రతిష్టాత్మకమైన G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం శని,ఆదివారాల్లో జరగనుంది.ఈ మేరకు 20 మంది దేశాధినేతలు ఈ కీలక సదస్సుకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే భద్రతా సిబ్బందిని, సాంకేతికత నిఘాను మోహరించింది. మరోవైపు భారత్ అందించే భద్రతతో పాటు ఆయా దేశాల నేతలు సొంత భద్రతను సైతం ఏర్పాటు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణం కోసం 'ది బీస్ట్'ను తరలిస్తున్నారు. భారత రోడ్లపై ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెప్టెంబర్ 7న భారత్ రానున్న జో బైడెన్ 8న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యూఎస్ ప్రథమ పౌరుడు ఆకాశంలో ప్రయాణించేందుకు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంతో పాటు పలు హెలికాప్టర్లను వినియోగిస్తారు.
బాంబు దాడులను సైతం నిలువరించే కారు ద బీస్ట్
రోడ్డు ప్రయాణం కోసం ఉపయోగించే ది బీస్ట్ కారును కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని అంటారు. కాడిలాక్ మోడల్‌ను 2018లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌లోకి ప్రవేశపెట్టారు. అత్యాధునిక ఫీచర్లతో, అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ కారును డిజైన్ చేశారు. అద్దాలు 5 ఇంచుల మందం, డోర్లు 8 ఇంచుల మందాన్ని కలిగి ఉంటాయి. డ్రైవర్ విండో మాత్రమే 3 ఇంచులు తెరుచుకుంటుంది. మిగతా అద్దాలు తెరుచుకోవు. బుల్లెట్ ప్రూఫ్ కలిగి ఉన్న కారు రసాయన,జీవాయుధ దాడులను తట్టుకుంటుంది. మరోవైపు దీని టైర్లు పగిలిపోవు, పంక్చర్ కావు. ఒకవేళ అవి దెబ్బతిన్నా,స్టీల్ రీమ్‌లతోనే ప్రయాణించగలదు. స్టీల్,అల్యూమినియం,టైటానియం, సిరామిక్‌తో తయారయ్యే బీస్ట్ బాంబు దాడులనూ ఎదుర్కొంటుంది. ఫ్యూయల్ ట్యాంక్‌ను ఏదైనా ఢీకొట్టిన అది పేలదు.
బీస్ట్‌ను సాధారణ డ్రైవర్లు నడపలేరు
అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఉపయోగించే ప్యానిక్ బటన్ సహా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుతారు. అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్‌నకు సంబంధించిన బ్లడ్ బ్యాగ్‌లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతారు. డ్రైవర్ క్యాబిన్‌లో సమాచారం కోసం జీపీఎస్ (GPS) ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. బీస్ట్‌ను సాధారణ డ్రైవర్లు నడపలేరు. ఎందుకంటే దీనికి ప్రత్యేక శిక్షణ అవసరం. డ్రైవర్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ ట్రైనింగ్ అందిస్తుంది. ఎమర్జెన్సీ ఎదురైతే అధ్యక్షుడిని ఎలా కాపాడాలనే అంశంపై శిక్షణ ఇస్తారు. ప్రతీ రోజు బీస్ట్ డ్రైవర్‌కు వైద్య పరీక్షలు చేసి అతని ఫిట్ నెస్ సామర్థ్యాన్ని నిర్థారిస్తారు. అనుకోని పరిస్థితులు తలెత్తితే 180 డిగ్రీల 'జె టర్న్'తో కారును తప్పించేలా డ్రైవర్‌కు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు.
తొలి అంచెలో భారత పారామిలిటరీ దళాలు భద్రత కల్పిస్తాయి
భారత రాజధాని దిల్లీలో అగ్రరాజ్యాధిపతి జో బైడెన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు అమెరికా అధికారులు ఇప్పటికే భారత్ చేరుకున్నారు. దిల్లీ ఐటీసీ మౌర్య షెరాటన్‌లోని 14వ ఫ్లోర్‌లో బైడెన్ బస చేయనున్నారు. ఈ మేరకు మూడెంచల భద్రతను భారత్ కల్పించనుంది. తొలి అంచెలో పారామిలిటరీ దళాలు ఉంటాయి. రెండో అంచెలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు ఉంటారు. ఇక మూడెంచలో యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు భద్రత కల్పించనున్నారు. అమెరికా భద్రతా సిబ్బంది పిస్తోళ్లు, లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ ఆయుధాలను కలిగి ఉంటారు. బైడెన్ భద్రత కోసం భారత్‌కు 75 నుంచి 80 వాహనాలు తీసుకురానున్నట్లు అగ్రరాజ్యం చెప్పింది. చర్చల అనంతరం వాటి సంఖ్యను 60కి కుదించినట్లు అధికార వర్గాల సమాచారం.