
Tamilnadu: టీవీకే పార్టీ పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం.. ముందస్తు బెయిల్ నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీవీకే పార్టీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది, అయితే మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. టీవీకే పార్టీ ఆరోపించిందేమంటే పోలీసుల లాఠీచార్జ్ కారణంగా తొక్కిసలాట ఏర్పడిందని, దీనిని తమిళనాడు పోలీసులు ఖండించారు. అయితే ఈ ఘటనపై సీబీఐ ద్వారా విచారణ జరగాలని కోర్టులో పిటిషన్ వేసింది. కోర్ట్ పిటిషన్‌పై విచారణలో విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పేర్కొన్నట్లుగా పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ సమయంలో సీబీఐ విచారణ కోరడం సరికాదని చెప్పింది.
Details
పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హెచ్చరించింది. బీజేపీ న్యాయవాది జీఎస్ మణి కూడా సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలుచేయగా కోర్టు తోసిపుచ్చింది. అలాగే టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ, కోర్టు ఆ పిటిషన్‌ను నిరాకరించింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని జడ్జి ప్రశ్నించారు. విచారణ సందర్భంగా కోర్టు పార్టీలకు కీలక సూచనలు చేసింది. బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, అంబులెన్స్, ప్రజలు బయటకు వెళ్లే మార్గాలు ఉంటే బాగుంటుందని సూచించింది. ఈ నిబంధనలు రూపొందించేవరకు, రహదారులపై పార్టీ సభలకు పోలీసులు అనుమతులు ఇవ్వవద్దని తమిళనాడు ప్రభుత్వం కూడా కోర్టుకు తెలిపింది.