
TG High court: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ 3 (గురువారం) వరకు భూముల్లో అన్ని పనులను నిలిపివేయాలని ఆదేశించింది.
పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది.
Details
జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషన్
కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ కేసులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) తరఫున ఎల్. రవిశంకర్ వాదనలు వినిపించారు. గతేడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకువచ్చింది.
ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ (TGIIC)కి కేటాయించారు. ప్రభుత్వ భూమిగా ఉన్నా సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి చర్యలు తీసుకోవాలి.
కానీ భారీ యంత్రాలను ఉపయోగించి చెట్లను నరికి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే నిపుణుల కమిటీ నియమించాలి.
Details
జంతువులను పరిరక్షించాలి
భూములు చదును చేయడానికి ముందు నిపుణుల కమిటీ పరిశీలన జరపాలి.
అక్కడ మూడు సరస్సులు, రాక్స్, అరుదైన జంతువులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది.
అయితే, ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కోర్టుకు తెలిపారు.
Details
రాష్ట్ర ప్రభుత్వ వాదనలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారు.
అయితే ఐఎంజీ ఈ భూములను వినియోగించకపోవడంతో అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఈ భూములు అటవీ భూమిగా ఎక్కడా నమోదు కాలేదు.
హెచ్‌సీయూ భూభాగంలోనే భారీ భవనాలు, నాలుగు హెలీప్యాడ్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా చోట్ల పాములు, నెమళ్లు, చెట్లు ఉంటాయి.
అయితే పిటిషనర్ల వాదనల ప్రకారం వాటన్నింటినీ అటవీ భూమిగా ప్రకటించాలా? ఇలా చూస్తే హైదరాబాద్‌లో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని ఏజీ వాదనలు వినిపించారు.