
Telangana: ఇంజినీరింగ్ ఫీజుల పెంపుకు హైకోర్టు నో.. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయమే ఫైనల్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఫీజులు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది కాలేజీలు వేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ) మాత్రమేనని స్పష్టం చేసింది. ఆరు వారాల లోగా టీఏఎఫ్‌ఆర్‌సీ తగిన నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. ఫీజుల పెంపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.
Details
హైకోర్టు అసంతృప్తి
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు టీఏఎఫ్‌ఆర్‌సీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతేడాది కాలేజీలు పెంపు ప్రతిపాదనలు ఇవ్వడం, కానీ టీఏఎఫ్‌ఆర్‌సీ సమయానికి నిర్ణయం తీసుకోకపోవడం, ఆపై కాలేజీలు కోర్టుకు రావడం అన్నదే పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించింది. గత బ్లాక్ పీరియడ్ ఫీజులే 2025-26కి వర్తిస్తాయంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు వంటి కాలేజీలతో సహా 11 కళాశాలలు గురువారం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశాయి.
Details
న్యాయవాదుల వాదనలు
కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, గత డిసెంబరులోనే ఫీజు ప్రతిపాదనలు సమర్పించామని, మార్చిలో జరిగిన కమిటీ సమావేశంలో అవి ఆమోదించారని పేర్కొన్నారు. రిజిస్టర్‌లో నమోదు అయిన వివరాలు దీనికి సాక్ష్యమన్నారు. టీఏఎఫ్‌ఆర్‌సీ తరఫున పి. శ్రీరఘురాం వాదిస్తూ, కాలేజీలు ఐదువేల పేజీలతో కూడిన ప్రతిపాదనలు ఇచ్చాయని, అవి పరిశీలించేందుకు సమయం అవసరమని తెలిపారు. అందుకే గత బ్లాక్ పీరియడ్ ఫీజులనే ఈసారి సిఫారసు చేశామని చెప్పారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని కాలేజీలు గతేడాదితో పోలిస్తే 70-90 శాతం వరకు ఫీజు పెంపు కోరాయని తెలిపారు
Details
గత ఫీజులే అమల్లోకి ఉంటాయి
వాదనలు విన్న జస్టిస్ కె. లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు సంవత్సరాల గడువు పూర్తయినా టీఏఎఫ్‌ఆర్‌సీ ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోవడం సమంజసం కాదని అన్నారు. డిసెంబరులో ప్రతిపాదనలు వచ్చి జూన్ వచ్చేలోగా నిర్ణయం తీసుకోలేకపోవడాన్ని తప్పుబట్టారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక మాత్రమే కోర్టును ఆశ్రయించడం పై ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం మీద కాలేజీల ఫీజు పెంపుపై తుది నిర్ణయం త్వరలోనే రానుంది. అప్పటివరకు గత ఫీజులే అమలులో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.