Page Loader
Himachal rains: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం .. 63 మంది మృతి,రూ.400 కోట్ల ఆస్తి నష్టం
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం .. 63 మంది మృతి,రూ.400 కోట్ల ఆస్తి నష్టం

Himachal rains: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం .. 63 మంది మృతి,రూ.400 కోట్ల ఆస్తి నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండగా, ఆకస్మిక వరదలు పరిస్థితిని మరింత విషమంగా మారుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ఈ వరదల ప్రభావంతో బియాస్ నది సహా రాష్ట్రంలోని అనేక ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్షాల తీవ్రతతో కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు అనేక చోట్ల చోటుచేసుకున్నాయి. ఫలితంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విపత్తు హిమాచల్‌ను భయానకంగా తాకింది. వారం రోజుల వ్యవధిలోనే 63 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకా 40 మంది గల్లంతయ్యారు.

వివరాలు 

నష్టం మరింత పెరిగే అవకాశం

రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు సుమారు రూ.400 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా . అయితే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, వారికి ఆహార పొట్లాలు అందించడంలో అధికారులు యాక్టివ్‌గా ఉన్నారు. ఇక మరోవైపు, భారత వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం నాడు సిమ్లా, సోలన్‌, సిర్మౌర్ జిల్లాల్లో, అలాగే ఈ నెల 6వ తేదీన ఉనా, బిలాస్‌పూర్‌, హమీర్‌పూర్‌, కాంగ్రా, చంబా, మండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.