Gyanvapi: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ముస్లిం ప్రార్థనలపై ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఏప్రిల్ 31 వరకు కొనసాగుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. అదే విధంగా జూలై వరకు వ్యాస్ సెల్లార్లో హిందువుల ప్రార్థనలు కూడా కొనసాగుతాయని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. వ్యాస్ తెహ్ఖానా వద్ద హిందువుల ప్రార్థనలు జరుపుకోవద్దంటూ స్టే ఇవ్వాలన్న వాదనను సుప్రీంకోర్టు నిరాకరించింది. జ్ఞానవాపిలోని వ్యాస్ తెహ్ఖానా లేదా సదరన్ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవవచ్చంటూ అలాహాబాద్ హైకోర్టు,వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
ముస్లింలు,ఇటు హిందువులు కూడా ప్రార్థనలు కొనసాగించుకోవచ్చు: చంద్రచూడ్
ముస్లింలు నమాజ్ ప్రార్థనలు చేసుకోవచ్చని, అదేవిధంగా తెహ్ఖానాలో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ ఈ ఏడాది జనవరి 17, 31 తేదీల్లో కోర్టులిచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో నిబంధనలకు లోబడి అటు ముస్లింలు, ఇటు హిందువులు కూడా ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. జ్ఞానవాపి మసీదు కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది హుజిఫా అహ్మదీ, హిందువుల తరఫున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదనలకు హాజరయ్యారు. హిందువులు కూడా పూజలు చేసుకోవచ్చంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణమైనవని కోర్టుకు నివేదించారు.
తదుపరి విచారణ జూలైలో..
వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మసీదు ప్రవేశద్వారం వద్ద ముస్లింలు నమాజ్ ప్రార్థనలు చేసుకోవచ్చని, నిష్క్రమణ ద్వారం వద్ద హిందువులు పూజలు జరుపుకోవచ్చని ప్రతిపాదించింది. ఇవే ఉత్తర్వులు ఈ ఏడాది జూలై 31వరకు కొనసాగుతాయని ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలను జూలైలో వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.