Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులే తమ కుమార్తె శ్రావణిని హత్య చేసి, దాన్ని అదృశ్యంగా చూపించడానికి కుట్ర పన్నారు. తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె శ్రావణి (24)కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగినా, భర్తతో మనస్పర్థలు కారణంగా విడిపోయింది. తల్లిదండ్రుల వెంటనే ఉంటూ గ్రామంలో కూరగాయల వ్యాపారం చేసేది.
కుమార్తెపై దాడి చేసి చంపిన తల్లిదండ్రులు
ఈ క్రమంలో నార్తు ఆములూరు ప్రాంతానికి చెందిన రబ్బానీ బాషా అనే యువకుడితో పరిచయం ఏర్పడటంతో వారు 20 రోజుల క్రితం కసుమూరు దర్గాలో వివాహం చేసుకున్నారు. వివాహం విషయం తెలిసిన తల్లిదండ్రులు నార్త్ ఆములూరుకు వెళ్లి శ్రావణిని బలవంతంగా ఇంటికొచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రావణి తల్లిదండ్రుల చేతిలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. తల్లిదండ్రులు మృతదేహాన్ని ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టి, తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల అదుపులో తల్లిదండ్రులు
అయితే గురువారం, డయల్ 100కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రావణి మృతదేహాన్ని పూడ్చి పెట్టారనే సమాచారంతో అనుమానాస్పద ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. అయితే శుక్రవారం శ్రావణి మృతదేహం బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.