Loading...
Delhi Pollution: 'దిల్లీ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారా?' : కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
'దిల్లీ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారా?' : కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Delhi Pollution: 'దిల్లీ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారా?' : కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పంట వ్యర్థాల (పరాలీ) కొనుగోలు ధరను ముందుగానే ప్రకటించాలని, వాటి నిర్వహణకు సంబంధించిన వ్యవస్థను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభంలోనే ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ''ఢిల్లీలో వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను'' అంటూ ప్రధాన న్యాయమూర్తి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఢిల్లీలో గాలిని పీల్చడం అంటే.. రోజూ 30 సిగరెట్లు తాగినట్లే

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా.. వాటిని ఉల్లంఘించే ఘటనలు కూడా అంతే ఎక్కువగా జరుగుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

ఇది మానవ సహజ స్వభావమని వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టుకు సహకరిస్తున్న అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ స్పందిస్తూ.. ఢిల్లీలో గాలి నాణ్యత ఇంకా అత్యంత ప్రమాదకర స్థాయిలోనే ఉందని తెలిపారు. కాలుష్యం కారణంగా తన గొంతుపై కూడా ప్రభావం పడుతోందన్నారు. ఢిల్లీలోని గాలిని పీల్చడం అంటే రోజూ 30 సిగరెట్లు తాగినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

పంట వ్యర్థాల దహనం 14 శాతం

ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో కాలుష్య స్థాయులు కొంత తగ్గాయని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.

తదుపరి పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగులబెట్టే ఘటనలు కూడా ఆగిపోయి ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.

దీనిపై అపరాజితా సింగ్ స్పందిస్తూ.. ఢిల్లీలో కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం 14 శాతం కారణమవుతోందన్నారు.

ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని, రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోందని చెప్పారు.

ఈ సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, పంట వ్యర్థాల దహనంతో పాటు చెత్తను కాల్చడం వంటి స్థానిక కాలుష్య కారకాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఖరీదైన కార్లలో తిరిగే సంపన్నుల సంగతేంటి: సుప్రీం 

ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే కాలుష్యంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.

ఢిల్లీలో కాలుష్యానికి పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణమా? లేక ధనిక వర్గాల ప్రైవేటు వాహనాలు కూడా సమస్యను పెంచుతున్నాయా? అని ప్రశ్నించింది.

పంట వ్యర్థాల గురించి పదేపదే మాట్లాడుతున్నామని, వాటి నిర్వహణకు అవసరమైన యంత్రాలను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొంది.

అయినప్పటికీ కొందరు రైతులు వాటిని వినియోగించేందుకు వెనుకాడుతున్నారని తెలిపింది.

మరి ఖరీదైన కార్లలో తిరిగే సంపన్నుల సంగతేంటని ప్రశ్నించింది. దీనిపై అపరాజితా సింగ్ స్పందిస్తూ.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం రవాణా రంగమేనని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక పథకం

వాహనాల నుంచి వెలువడే పొగ కూడా కాలుష్యాన్ని పెంచుతోందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలోని రహదారులపై వాహనాలు ఒకదాని వెనుక మరొకటి నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ కారణంగా కూడా కాలుష్యం పెరుగుతోందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక పథకం అమల్లో ఉందని తెలిపారు.

వివిధ ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల వివరాలతో కూడిన నివేదికను కూడా ప్రభుత్వ తరఫున సమర్పించినట్లు వెల్లడించారు.

వివరాలు 

ఢిల్లీలోకి వచ్చే బస్సులపై నిబంధనలు

వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ స్టేజ్-6 (BS-6) ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు ఐశ్వర్య భాటి తెలిపారు.

డీజిల్ ఆటోలను దశలవారీగా తొలగించడంతో పాటు ఇతర నగరాల నుంచి ఢిల్లీలోకి వచ్చే బస్సుల విషయంలోనూ తప్పనిసరి నిబంధనలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలను అవి జారీ చేసిన ప్రాంతంతో జియోట్యాగింగ్ చేస్తున్నామని, అలాంటి ధ్రువపత్రం లేకుండా ఇంధనం కూడా అందుబాటులో ఉండదని చెప్పారు.

ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు తక్షణ, మధ్యకాలిక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు.

వివరాలు 

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు 

మరోవైపు టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఎక్కువసేపు నిలిపి ఉంచకుండా చూడాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అపరాజితా సింగ్ తెలిపారు.

ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను ఢిల్లీ సరిహద్దుల్లో ఎక్కువసేపు ఆపుతున్నారని, ఆ సమయంలో ఇంజిన్లు ఆన్‌లోనే ఉండటంతో కాలుష్యం మరింత పెరుగుతోందని వివరించారు.

దీనిపై కేంద్రం తరఫున ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. ఢిల్లీ భౌగోళిక పరిస్థితుల కారణంగా శీతాకాలంలో గాలి సరిగా ప్రసరించలేకపోతోందని చెప్పారు.

వివరాలు 

GRAP కింద చర్యలు అమలు

కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ చర్యలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పలేమన్నారు. అయితే ఢిల్లీ వాయు నాణ్యత సూచీ (AQI) ఇప్పటికే 400 మార్కును తాకుతోందని ప్రధాన న్యాయమూర్తి గుర్తుచేశారు.

పలు కార్యకలాపాల వల్ల కాలుష్యం పెరుగుతోందని, దీర్ఘకాలిక చర్యలు అమల్లో ఉన్నప్పటికీ పండగల సమయంలో కూడా కాలుష్యం ఎక్కువైందని ఐశ్వర్య భాటి వివరించారు.

ADVERTISEMENT