Page Loader
Air India flight: 900 అడుగుల కిందికి దిగిన ఎయిర్ ఇండియా విమానం సంచలనం.. డీజీసీఏ విచారణ
900 అడుగుల కిందికి దిగిన ఎయిర్ ఇండియా విమానం సంచలనం.. డీజీసీఏ విచారణ

Air India flight: 900 అడుగుల కిందికి దిగిన ఎయిర్ ఇండియా విమానం సంచలనం.. డీజీసీఏ విచారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గత నెల కుప్పకూలిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దాంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.అది జరిగిన రెండు రోజుల్లోపే మరో విమాన ప్రమాదం తృటిలో తప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసారి ప్రమాదం నుంచి తప్పించుకున్నది ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం. ఇది ఢిల్లీ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నా వెళ్లేందుకు జూన్ 14న బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం అకస్మాత్తుగా 900 అడుగుల లోతుకు కిందికి దిగి ప్రయాణికులకు కలవరాన్ని కలిగించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా భూమి సమీపంలోకి దిగిపోతుండటంతో వెంటనే వార్నింగ్ సిగ్నల్ వెలువడింది.

వివరాలు 

ఇద్దరు పైలట్లను విధులకు దూరంగా..

పైలట్లు వెంటనే అప్రమత్తమై అత్యవసర భద్రతా చర్యలు చేపట్టడంతో, విమానం మీద నియంత్రణ పొందగలిగారు. అయితే అప్పటికే రెండు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వాతావరణం కూడా అనుకూలంగా లేకపోయినా, పైలట్ల ప్రావీణ్యం కారణంగా విమానం ఆపదను దాటింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. ఈ విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా విధుల నుండి విరమింపజేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఎయిరిండియా భద్రతా విభాగం అధిపతికి జూన్ 17న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

వివరాలు 

DGCA దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో సర్వే

ఇదిలా ఉంటే,జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం విషాదం ఇంకా మరువకముందే మరో ప్రమాదం తృటిలో తప్పించుకోవడం ప్రయాణికులపై తీవ్రమైన మానసిక ప్రభావం చూపింది. ఆ విమాన ప్రమాదంలో మొత్తం 242మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడటంతో హాస్టల్‌లో ఉన్న కొందరు విద్యార్థులు సహా 241మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో,DGCA దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో సర్వే చేపట్టింది. ఈ పరిశీలనలో అనేక విమానయాన లోపాలు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని విమానాశ్రయాల్లో విమానాల టైర్లు పూర్తిగా అరిగిపోయి ఉన్నాయని,దానివల్ల దేశీయ విమానాలపై ప్రభావం చూపిందని గుర్తించారు. కొన్ని కేసుల్లో ఒకే రకమైన లోపాలు పునరావృతమవుతున్నాయని వెల్లడించారు.

వివరాలు 

సిమ్యులేటర్.. విమానం కాన్ఫిగరేషన్‌తో సరిపోలడం లేదు 

అంతేకాకుండా, ఓ సిమ్యులేటర్ విమాన కాన్ఫిగరేషన్‌కు సరిపోలకుండా ఉండటం, ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ వెర్షన్ అప్డేట్ కాకపోవడం వంటి సాంకేతిక లోపాలు కూడా వెల్లడయ్యాయి. వీటన్నీ విమానయాన సంస్థల్లో పకడ్బందీ పర్యవేక్షణ లోపిస్తున్నదనే ఆందోళనలకు దారితీసే అంశాలుగా డీజీసీఏ పేర్కొంది.