సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్
స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలో అంతర్గతంగా చెలరేగుతున్న హింస, ఘర్షణలపై కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేజ్రీవాల్ ఛత్రసాల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. దేశంలో అంతర్గత విభేదాలు చెలరేగుతున్నప్పుడు భారతదేశం ప్రపంచ నాయకుడిగా, విశ్వగురువు ఎలా అవుతుందని ప్రశ్నించారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుహ్‌లో హింసకు కారణమని కేజ్రీవాల్ విమర్శించారు. ఈ సంతోషకరమైన రోజున తన మనసు బాధగా ఉందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ మండుతోందని ఒక సోదరుడు, మరో సోదరుడితో గొడవపడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.
సమిష్టిగా పని చేసినప్పుడు అది సాధ్యం: కేజ్రీవాల్
అంతర్గత విభేదాలు భారతదేశాన్ని వెనక్కి నెట్టివేస్తున్నట్లు దిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదగాలంటే, సమిష్టిగా పని చేయాలన్నారు. దేశంలోని వారు ఒకరితో మరొకరు పోరాడుతుంటే, భారతదేశం విశ్వగురువు ఎలా అవుతుందని ప్రశ్నించారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ అగ్రగామి అవుతుందా? కేజ్రీవాల్ అడిగారు. దిల్లీ అమలవుతున్న ఉచిత విద్యుత్ కావాలో, లేక పెద్ద పారిశ్రామికవేత్తల రుణమాఫీ కావాలో దేశ ప్రజలు నిర్ణయించుకోవాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రతి బిడ్డ ఉన్నత స్థాయి విద్యనభ్యసించినప్పుడే నిజమైన ప్రగతిని సాధ్యమన్నారు.