
Operation Sindoor: 'మాకు న్యాయం జరిగింది' .. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు
ఈ వార్తాకథనం ఏంటి
మంగళవారం అర్థరాత్రి తర్వాత, పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మెరుపుదాడులు ప్రారంభించింది.
గతనెల 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఆ ఘటనకు ప్రతిగా భారత ఆర్మీ 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఈ దాడులను నిర్వహించింది.
ఈ ఘటనపై అంతర్జాతీయంగా ప్రముఖులు స్పందించగా,దాడిలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులూ స్పందించారు.
వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.భారత ఆర్మీ చేపట్టిన చర్యలతో తమకు న్యాయం జరిగినట్టు వారు భావించారు.
భారత సైన్యానికి తాము పూర్తి మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు.జమ్మూ కశ్మీర్ ప్రాంత ప్రజలు కూడా"భారత్ మాతాకీ జై" నినాదాలతో భారత సైన్యానికి జిందాబాద్లు చెప్పారు.
వివరాలు
అందుకే ఈ దాడులకు 'సిందూర్'
"మేము తీవ్ర శోకంలో ఉన్నా,ఈ దాడుల వార్తతో కొంత ఆనందాన్నిఅనుభవిస్తున్నాం. ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మా నమ్మకం వుంది.ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరు దానికి ఉదాహరణ. మా కన్నీళ్లు ఇంకా ఆగలేదు. ఉగ్రవాదుల వల్ల మా సోదరీమణులు తమ సిందూరాన్ని కోల్పోయారు. అందుకే ఈ దాడులకు 'సిందూర్' అనే పేరు పెట్టారు. తొమ్మిది ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులకు దిగింది. ఇది వింతగా, కానీ గర్వంగా అనిపిస్తున్న అనుభూతి. ఆనంద భాష్పాలు ఆగడం లేదు" అని సంతోష్ జగ్‌దలే కుమార్తె అశ్విరి చెప్పారు.
వివరాలు
భారత ఆర్మీకి సెల్యూట్
"ఉదయం నుండి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నాను. భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాను. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజల బాధను పట్టించుకుని పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం గొప్ప విషయం. ఈ వార్త తెలిసినప్పటి నుండి మా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉంది" అని శుభమ్ ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది తెలిపారు.