
Lucknow: లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్‌బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో పైఅంతస్తుల వరకు పొగ వ్యాపించింది.
ఈ ఘటనతో రోగులు, వారి కుటుంబసభ్యులు భయభ్రాంతులకు లోనయ్యారు.
వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక వాహనాలు పని చేస్తున్నాయి.
దట్టమైన పొగ కారణంగా రోగులు, సహాయకులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అపాయాన్ని నివారించేందుకు ఆసుపత్రి భవనాన్ని పూర్తిగా ఖాళీ చేశారు.
వివరాలు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష
ప్రస్తుతం వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల గురించి అధికారిక సమాచారం లేదు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. పోలీసులు, సంబంధిత అధికార యంత్రాంగం ఘటనాస్థలంలోనే ఉన్నాయి.
ఆసుపత్రి పరిసరాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు.
అధికారుల నుంచి ఫోన్ ద్వారా పూర్తి సమాచారం పొందారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు.
వివరాలు
ప్రస్తుతం ఆందోళన అవసరం లేదు: డిప్యూటీ సీఎం
ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
మూడవ అంతస్తులో తొలుత పొగ కనిపించిందని, వెంటనే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది రోగులను తరలించడం ప్రారంభించారని తెలిపారు.
దాదాపు 200 మంది రోగులను సురక్షితంగా తరలించి ఇతర ఆసుపత్రుల్లో చేర్చారు.
ప్రస్తుతం ఆందోళనకు అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు.
భవనం లోపల మంటలను అగ్నిమాపక సిబ్బంది కట్టడి చేయడానికి కృషి కొనసాగిస్తోందని పేర్కొన్నారు.