చెన్నైలో వరుణ బీభత్సంతో విమానాల దారి మళ్లింపు.. బడులకు సెలవు ప్రకటించిన సర్కార్
తమిళనాట భారీ వర్షాలు ఆ రాష్ట్ర రాజధాని చెన్నెని వరదలతో ముంచెత్తుతున్నాయి. గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులకు భారీ వర్షాలు, చల్లటి గాలులతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ప్రధాన నగరం చెన్నై సహా పరిసర తీర ప్రాంతాలతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పట్టు లాంటి ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వరుణుడు బీభత్సం సృష్టించాడు. రాజధాని సమీపంలోని మీనంబాక్కంలో సోమవారం ఉదయం 5.30 గంటల వరకు 13.7 సెమీ వర్షపాతం రికార్డైంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచిపోయి చెన్నై రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఈ నేపథ్యంలోనే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించింది.
మరో రెండు రోజులూ చైన్నెకు వానగండం
మరోవైపు వాతావరణ శాఖ అధికారుల ముందస్తు అంచనా మేరకు చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నేటి మధ్యాహ్నం వరకు మోస్తారు నంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తమిళనాడు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. విమానాలకు భారీ వర్షాల ఎఫెక్ట్ తగిలింది. ఈ మేరకు వాటి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి వెళ్లాల్సిన 12కుపైగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆలస్యమయ్యాయి. నగరానికి రావాల్సిన 6 విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు. ఈ నెల 21 వరకు చెన్నై, సహా పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన తమిళ సర్కారు చర్యలను ప్రారంభించింది.