
Interest Waiver: తెలంగాణలో ఆస్తి పన్ను బకాయిలకు భారీ ఊరట.. 90శాతం వడ్డీ మాఫీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ చేస్తూ వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ (ఓటీఎస్) ప్రకటించింది.
2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించిన వారికి 90శాతం వడ్డీ మాఫీ వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
వడ్డీతో సహా పన్ను చెల్లించిన ఇంటి యజమానులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 90శాతం వడ్డీ మాఫీ వర్తించనుంది.
మిగిలిన పన్నులను పూర్తిగా వసూలు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Details
మార్చి 31 వరకు గడువు
2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేసి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు.
రెడ్ నోటీసుల తర్వాత కూడా స్పందించని బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసి, మున్సిపల్ పరంగా సేవలను నిలిపివేస్తున్నారు. వాటర్ కనెక్షన్లు తొలగించే చర్యలు కూడా తీసుకుంటున్నారు.
ఇప్పటికే కరీంనగర్‌లో ఓ థియేటర్, పార్క్, పలు షాపులు, ఇళ్లను సీజ్ చేశారు.
Details
హైదరాబాద్ తరహా వడ్డీ మాఫీ
కరీంనగర్‌లో ఆస్తిపన్ను వసూలు తగ్గుతున్న కారణంగా హైదరాబాద్ తరహాలో వడ్డీ మాఫీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేశారు.
కానీ ఈ పథకాన్ని మార్చి మొదటి వారంలో ప్రకటించాల్సి ఉన్నా, చివరి అయిదు రోజులకు మాత్రమే పరిమితం చేయడంతో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారీగా బకాయిలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో ఆస్తిపన్ను వసూలు కాలేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.52 కోట్ల రూపాయల పన్ను వసూలు చేయాల్సి ఉంది.
ఇప్పటివరకు 34 కోట్ల రూపాయల మేర మాత్రమే వసూలైంది. మిగిలిన 18 కోట్లలో అధిక భాగం బకాయిలే ఉన్నాయి.
Details
ప్రజలు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ను వినియోగించుకోవాలి
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 38,654 మంది తమ ఆస్తిపన్నులు ఇంకా చెల్లించాల్సి ఉంది.
90% వడ్డీ మాఫీ పథకం అమలులో ఉన్నందున పన్నుదారులు వెంటనే బకాయిలను చెల్లించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ విజ్ఞప్తి చేశారు.
ప్రజలు చెల్లించే పన్నులతో అభివృద్ధి పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు.
Details
గడువు పొడిగిస్తే వసూళ్లు పెరిగే అవకాశం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని మున్సిపాలిటీల్లో 70శాతం, మరికొన్నింటిలో 90శాతం వరకు పన్ను వసూలు అయినప్పటికీ, పూర్తి స్థాయిలో వసూలు కావాలంటే గడువు పొడిగించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మార్చి 30న ఉగాది, 31న రంజాన్ సెలవులు ఉండటంతో వడ్డీ మాఫీ గడువును కనీసం 15 రోజుల వరకు పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ అధికారులు కూడా గడువు పెంచితే వసూళ్లు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు.