ED: కెనడా కాలేజీలపై మానవ అక్రమ రవాణా ఆరోపణలు.. ఈడీ దర్యాప్తు
కెనడా సరిహద్దుల నుంచి అమెరికాకు భారతీయులను అక్రమంగా తరలించేందుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపడుతోంది. ఈ కేసులో కెనడాలోని కొన్ని కాలేజీలు, భారత సంస్థల పాత్రపై విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. 2022 జనవరి 19న గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న సమయంలో తీవ్ర శీతల వాతావరణం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భవేష్ పటేల్, మరికొందరిపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదైంది.
కెనడా మీదుగా అమెరికాకు అక్రమ రవాణా
నిందితులు మానవులను అక్రమంగా తరలించే సంస్థలతో కలిసి కుట్ర పన్ని భారతీయులను దేశ సరిహద్దుల దాటించారని అధికారులు వెల్లడించారు. కెనడా మీదుగా అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా, కెనడా, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని, విదేశాల్లో స్థిరపడాలని కోరుకునే భారతీయులను ఈ నిందితులు ట్రాప్ చేశారని దర్యాప్తు వెల్లడించింది. దీనికి ప్రతీ వ్యక్తి నుంచి రూ.55 లక్షల నుండి రూ.60 లక్షల వరకు వసూలు చేశారని తెలుస్తోంది. కానీ విద్యార్థి వీసాపై కెనడా వెళ్లినవారు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరలేదు.
ఎనిమిది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ
ఫలితంగా కాలేజీలు వారి నుంచి తీసుకున్న అడ్మిషన్ ఫీజును తిరిగి వారి ఖాతాల్లో జమ చేసేవారని అధికారులు తెలిపారు. ఈ కేసులో ముంబయి, నాగ్‌పుర్, గాంధీనగర్ వంటి 8 ప్రదేశాల్లో సోదాలు చేపడుతున్నట్లు ఏజెన్సీ ప్రకటించింది. విదేశాల్లో భారతీయులకు ప్రవేశం ఇప్పించేందుకు ముంబయి, నాగ్‌పుర్‌లోని రెండు సంస్థలు పని చేస్తున్నాయని గుర్తించారని వెల్లడించారు. ఈ సంస్థలు ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ కళాశాలల నుండి సుమారు 35వేల మంది విద్యార్థులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నాయని అధికారులు తెలిపారు.