Page Loader
Bonaalu: ఈ నెల 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ.. రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఈ నెల 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ.. రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

Bonaalu: ఈ నెల 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ.. రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 26న ప్రారంభమయ్యే ఆషాఢ బోనాల పండుగ కోసం హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలు సిద్ధమవుతున్నాయి. నెలరోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి బోనం గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించనున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న 28 ప్రధాన ఆలయాల్లో ఈ పండుగ ఘనంగా జరగనుంది. ప్రతి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్న అతిథుల వివరాలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు ఇప్పటికే రూపొందించారు. గతంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

వివరాలు 

భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన 

ఆలయాలను దర్శించుకునే భక్తుల కోసం తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వేడి నుండి రక్షణ కోసం చలువ పందిళ్లను వేస్తున్నారు. భక్తులు క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. బోనం సమర్పణలో ఆటంకాలు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లపై సమీక్షలు జరుగుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, కమిషనర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గదర్శనం అందించారు. అలాగే, రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

వివరాలు 

పలు ఆలయాల్లో తేదీల ప్రకారం బోనాల వేడుకలు 

జులై 1న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల పండుగ జరగనుందని అధికారులు తెలిపారు. జూలై 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. జూలై 20, 21 తేదీల్లో లాల్‌దర్వాజా సింహవాహినీ మహంకాళి ఆలయంలో వేడుకలు నిర్వహించనున్నారు. నాచారంలో ఉన్న మహంకాళేశ్వర ఆలయంలోనూ బోనాలు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

ఏర్పాట్లకు 20 కోట్లు మంజూరు 

ఈ ఏడాది బోనాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఉపయోగించి భక్తుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అందించనున్నారు. ఆలయాల స్థాయిని బట్టి దేవాదాయ శాఖ సంబంధిత గ్రాంట్‌లు విడుదల చేసింది. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయి ప్రణాళికలను రూపొందిస్తున్నారు.