హైదరాబాద్: అండర్‌వాటర్ టన్నెల్ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్
ఈ వార్తాకథనం ఏంటి
అతి సమీపం నుంచి సముద్ర జీవులను 180-డిగ్రీల కోణంలో చూడాలనుకుంటున్నారా? వేసవిలో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఆ డెస్టినేషన్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.
నగరంలోని కూకట్‌పల్లి వద్ద బాలానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇటీవల ప్రారంభించిన అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభిస్తోంది. దీంతో ఈ ఎక్స్ పోను చూసేందుకు పబ్లిక్ భారీగా తరలివస్తున్నారు.
ఈ ఎక్స్‌పోలో నీటి అడుగున సొరంగంలో సుమారు 500 రకాల చేపలను ప్రదర్శిస్తున్నారు. మొత్తం 3,000 చేపలను ప్రదర్శిస్తున్నారు. ఈ జాతుల్లో చాలా వరకు మలేషియా, సింగపూర్ నుంచి తెప్పించారు.
హైదరాబాద్
సొరంగంలో మొత్తం 20 అక్వేరియంల ఏర్పాటు
200 అడుగులకు పైగా పొడవున్న సొరంగంలో మొత్తం 20అక్వేరియంలను ఏర్పాటు చేశారు.
వివిధ రకాల చేపలలో స్టార్ ఫిష్, ఏంజెల్ ఫిష్, క్లౌన్ ఫిష్, సీ హార్స్, రాసెస్, ఈల్స్, బాక్స్ ఫిష్, ఇతర అరుదైన జాతులు ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తున్నారు.
నీటి అడుగున టన్నెల్ అక్వేరియంలో అత్యంత ఖరీదైన చేప అరపైమా కూడా ఉంది. దీని ధర రూ. 6లక్షల వరకు ఉంటుంది.
ఇది 60కిలోల బరువు ఉంటుంది. టన్నెల్, అక్వేరియం ట్యాంకుల కోసం దాదాపు 2000లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు.
ఏప్రిల్ 14న ప్రారంభమైన ఈ ప్రదర్శన నగరంలో 60 రోజుల పాటు తెరిచి ఉంటుంది. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు తెరిచి ఉంటుంది.