Page Loader
ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే
ఈనెలలోనే పట్టాలెక్కనున్న హైదరాబాద్‌- బెంగళూరు వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ రైలు

ఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ .. హైదరాబాద్‌-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 02, 2023
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మహానగరానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేసింది. దేశంలోని తొలి రెండు దిగ్గజ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు కాచిగూడ - యశ్వంత్ పూర్ మధ్య కొత్త వందే భారత్ రైలును నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌ డివిజన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి రూట్లలో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ నెల 6న, లేదా 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో నూతన రైలును ప్రారంభించనున్నారు. మహబూబ్​నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా యశ్వంత్ పూర్ చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

DETAILS

ఎనిమిదిన్నర గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రైల్లో ప్రయాణించాలంటే దాదాపుగా 11 గంటల మేర సమయం వెచ్చించాల్సి వస్తోంది. అయితే సెమీ బుల్లెట్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ప్రయాణం దాదాపుగా ఎనిమిదిన్నర గంటలకు తగ్గిపోనుంది. ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయలుదేరి,మధ్యాహ్నం 2:30 గంటలకే బెంగళూరు మహానగరానికి చేరుకుంటుంది. తిరిగి మధ్యహ్నం 3 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 11:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన 2 రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడవడం విశేషం.ఈ మేరకు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రజలు వందే భారత్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆధునాతనమైన రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది.