Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరో కొత్త నిర్ణయం.. భద్రతా సేవలలో ట్రాన్స్‌జెండర్లు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవం అందించాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. నిర్వహణ నుంచి ప్రయాణికుల సేవల వరకు అనేక కొత్త చర్యలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక ముందడుగు వేసింది. మహిళల భద్రతను బలోపేతం చేయడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ఉద్దేశంతో 20 మంది ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. ఈ చర్య మహిళలకు మరింత భద్రత కల్పించడమే కాకుండా, వారికి గౌరవం, నమ్మకం పెంచే వ్యూహాత్మక ప్రయత్నంగా అధికారులు పేర్కొంటున్నారు.
వివరాలు
రోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు
ఎంపికైన 20 మంది ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికే శిక్షణను పూర్తి చేసుకుని, నేటి నుండి కొన్ని నిర్ణీత మెట్రో స్టేషన్లలోనూ, రైళ్లలోనూ విధులు చేపట్టనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో సేవలు అందిస్తోంది. రోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తుండగా, వారిలో దాదాపు 30 శాతం మంది మహిళలే ఉండటంతో, వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తీసుకున్న ఈ చర్యలో భాగంగానే ట్రాన్స్‌జెండర్ల నియామకం జరిగినట్లు అధికారులు వివరించారు.
వివరాలు
భవిష్యత్తులో మరికొందరు ట్రాన్స్‌జెండర్లు
ప్రస్తుతం నియమితులైనవారిని ప్రధానంగా మహిళా కోచ్‌లలో భద్రతా అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కొంతమందిని ప్రయాణికుల బ్యాగేజ్ స్కానింగ్ పర్యవేక్షణ బాధ్యతల్లో, మరికొందరిని ప్రయాణికులకు సమాచారమందించే కేంద్రాల్లో విధులు నిర్వర్తించేట్లుగా ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలనే విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, ఆ దిశగానే హైదరాబాద్ మెట్రో కూడా ముందుకెళ్తూ ట్రాన్స్‌జెండర్లకు ఈ అవకాశాన్ని కల్పించింది. భవిష్యత్తులో మరికొందరు ట్రాన్స్‌జెండర్లను వివిధ విభాగాల్లో సేవల్లోకి తీసుకునే అవకాశముందని సమాచారం.