గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు
గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేదుకు అనేక అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరో అడుగు ముందుకేశాయి. తాజాగా నగర పరిధిలో 'ఆక్సిజన్ పార్కు'లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలోని ఫ్లై ఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఈ విషయాన్ని ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఎల్‌బీ నగర్ కామినేని ఫ్లైఓవర్ కింద తొలి ఆక్సిజన్ పార్కు
ఎల్‌బీ నగర్ జోన్‌లోని కామినేని ఫ్లైఓవర్ కింద తొలి ఆక్సిజన్ పార్కు ఏర్పాటు కాబోతోంది. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేసే మొక్కలను ఎంపిక చేసి వాటిని పార్కుల్లో నాటనున్నారు. తద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను నగర ప్రజలకు అందించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఆక్సిజన్ పార్కులో రూపకల్పనలో భాగంగా ఫ్లై ఓవర్ల పిల్లర్లను నిలువు తోటలతో అలంకరించనున్నారు. ఈ పార్కుల్లో పిల్లల కోసం ప్లే ఏరియా, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఫౌంటైన్లు, శిల్పాలను అందుబాటులో ఉంచనున్నారు. వ్యాయామం, నడవడానికి ట్రాక్‌తో మరిన్ని సౌకర్యాలను ఆక్సిజన్ పార్కుల ద్వారా ప్రజలకు అందించనున్నారు. కామినేని ఫ్లైఓవర్ వద్ద 40మందికి పైగా కూర్చునే యాంఫిథియేటర్‌ను కూడా ప్లాన్ చేశారు.