
Hyderabad : హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ కు జీహెచ్ఎంసీ కసరత్తు.. ప్రారంభం ఎప్పుడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తులు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని హరేకృష్ణ ఫౌండేషన్ తో కలిసి అమలు చేయనున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో త్వరలో ఈ బ్రేక్ ఫాస్ట్‌ను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్కీమ్ ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
రూ.11.43 కోట్ల ఖర్చుతో కొత్త స్టాల్స్ ఏర్పాటు చేస్తున్న బల్దియా
హైదరాబాద్‌లో పేదవారిని తృప్తి పరచేందుకు రూ.5 భోజన కార్యక్రమం 2013లో మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడంతో, జీహెచ్ఎంసీ పరిధిలోని ఇప్పటికే ఉన్న రూ.5కే భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్ స్టాల్స్‌ను అధికారులు కొత్తగా మారుస్తున్నారు. ప్రస్తుతం 139 స్టాల్స్ ఉన్నా, వీటి సంఖ్యను 150కు పెంచడం జరుగుతోంది. అప్పుడెప్పుడో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో కొన్ని డ్యామేజ్ అయ్యాయి. మరికొన్నిచోట్ల పూర్తిగా పాడై వినియోగించేందుకు వీలులేకుండా పోయాయి. దీంతో బల్దియా రూ.11.43 కోట్ల ఖర్చుతో కొత్త స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 60 కొత్త స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. గత స్టాల్స్‌తో పోలిస్తే, ఈ కొత్త స్టాల్స్ మూడింతల వరకు పెద్ద స్థలంతో రూపొందించబడ్డాయి.
వివరాలు
నెలాఖరులో ప్రారంభం కానున్న పథకం
హరేరామ హరేకృష్ణ మూవ్‌మెంట్‌తో కలిసి ప్రభుత్వం రూ.5కే నాణ్యమైన, పౌష్టికరమైన భోజనాన్ని అందిస్తుంది. జీహెచ్ఎంసీ త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించనుంది. ఒక్కో బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు రూ.19, అందులో రూ.5 ప్రజల నుంచి తీసుకుంటారు, మిగిలిన రూ.14 ను జీహెచ్ఎంసీ భరించనుంది. ఈ పథకం ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
వివరాలు
25,000 మందికి బ్రేక్‌ఫాస్ట్
తదుపరి, ఈ స్కీమ్‌లో ఒక్కో రోజు ప్రత్యేకంగా ఒక వెరైటీ టిఫిన్ ఇవ్వాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ మెనూ సిద్ధం చేసింది. ఇందులో ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు ఉన్నాయి. ఇప్పటివరకు అందించే రూ.5కే భోజనంతో పాటు, ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం అయిన తర్వాత బస్తీ ప్రాంతాల వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు ఎంతో లాభపడతారని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగరంలో రోజుకు సుమారు 25,000 మందికి బ్రేక్‌ఫాస్ట్ అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.