హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య.. కారణం ఇదే!
హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్న నెపంతో ఆమె మాజీ లవర్, స్నేహితులతో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. మహబూబాబాద్ జిల్లాలోని సంకిసకు చెందిన 18ఏళ్ల కె.కార్తీక్ హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసుకుంటున్నాడు. గత నెల 13నుంచి అదృశ్యమయ్యాడు. ఆగస్ట్ 16న బాధిత సోదరుడు శంకర్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ క్రమంలోనే CCTV ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా తెలుస్తోంది.
మూడు రోజులు సన్నిహితంగా ఉన్నారని తెలిసి హత్యకు ప్లాన్
విజయనగరం జిల్లా రాగోలుకు చెందిన సాయి హైదరాబాద్‌లో ఉంటూ యూట్యూబర్‌గా మారాడు. అతనికి జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఓ యువతి పరిచయమైంది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. కొంతకాలానికి సాయి ప్రవర్తనతో విసిగిపోయిన యువతి అతనికి దూరంగా ఉంటోంది. ఇదే సమయంలో కార్తీక్ ఆమెకు దగ్గరయ్యాడు. గత నెలలో వీరిద్దరూ యూసుఫ్ గూడలోని కార్తీక్ సోదరుడు శంకర్ గదిలో మూడు రోజులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సాయి కార్తీక్‌ను చంపాలని భావించాడు. ఇందుకోసం స్నేహితులు కె.సురేష్, ఎం.రఘు, ఎన్.జగదీష్ సహాయం తీసుకున్నాడు. గత నెల 13న, రెండు బైకులపై కార్తీక్ గదికి వెళ్లిన నిందితులు, యువతి దుస్తులు కొన్ని తమ గదిలో ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని కోరారు.
నిందితులను పట్టించిన సెల్ ఫోన్
దీంతో ఓల్డ్‌బోయినపల్లి పాత విమానాశ్రయం మార్గంలోని అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. మార్గం మధ్యలో కార్తీక్‌ను ద్విచక్రవాహనంపై నుంచి కింద పడేసి దాడి చేశారు. ఇదే సమయంలో చెట్టుకు కట్టేసి కత్తితో పక్కటెముకల్లో పొడిచారు. అది వంకరకావడాన్ని గమనించిన నిందితులు, బాధితుడ్ని బోర్లా పడేసి పీకకోశారు. అంతటితో ఆగకుండా బండరాయితో తలపై మోదారు. చనిపోయాడని నిర్ధరించుకున్నాకే నలుగురూ అక్కడ్నుంచి పారిపోయారు. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ సెల్‌ఫోన్‌ను సురేష్ ఆన్ చేశారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులు సాయి, రఘు, జగదీష్‌లను అరెస్ట్ చేశారు. హత్యలో యువతి పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.