Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని
దిల్లీ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా ముగ్గురు సివిల్ విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన మరవకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో సివిల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థిని ఒత్తిడి, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ మీడియాలు నివేదించాయి.
మానసిక ఒత్తిడికి లోనై అత్మహత్య
మహారాష్ట్రకు చెందిన అంజలి ఐఏఎస్ కావాలని 2022లో దిల్లీకి వచ్చింది. మూడుసార్లు పరీక్ష రాసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మానసిక ఒత్తిడి లోనై ఆత్మహత్య చేసుకుంది. అమ్మ, నాన్న నన్ను క్షమించండి, నేను చాలా విసిగిపోయా, ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసినా నా వల్ల కాలేద అని బాధితురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
ఇరుకు గదుల్లోనూ యూపీఎస్సీ పరీక్షలకి ప్రిపేర్
ఇదిలా ఉండగా దిల్లీలో చాలా మంది విద్యార్థులు ఇరుకైన గదుల్లోనే యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఒక్కొ గదికి రూ.12 వేల నుంచి 15 వేల వరకు యాజమానులు అద్దె వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.