LOADING...
CM Vijay: 'ఆ బాధ జీవితాంతం మర్చిపోలేను'.. అసెంబ్లీలో విజయ్ కీలక వ్యాఖ్యలు
'ఆ బాధ జీవితాంతం మర్చిపోలేను'.. అసెంబ్లీలో విజయ్ కీలక వ్యాఖ్యలు

CM Vijay: 'ఆ బాధ జీవితాంతం మర్చిపోలేను'.. అసెంబ్లీలో విజయ్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు. హిందీ భాషా వివాదం, నీట్ పరీక్ష, కరూర్ తొక్కిసలాట ఘటనతో పాటు పలు రాజకీయ అంశాలపై ఆయన సభలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విమర్శకులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రావడం అంత సులభంగా జరగలేదని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు తాను, తన పార్టీ ఎన్నో సవాళ్లు, కుట్రలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ''మాది నటుడి పార్టీ అని, నేను సినిమా సెట్స్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానని చాలామంది ఎగతాళి చేశారు. అయితే అలాంటి విమర్శలను నేను ఎప్పుడూ పట్టించుకోలేదని అన్నారు.

వివరాలు

నీట్, హిందీ అంశాలపై స్పష్టమైన వైఖరి

సాధారణంగా రాజకీయ నాయకులు ముందుగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తారని, కానీ తాను ముందుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి ఆదరణ పొందిన తర్వాతే పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతోనే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. అసెంబ్లీలో నీట్ వివాదాన్ని ప్రస్తావించిన విజయ్, ఆ పరీక్షా విధానం విద్యా వ్యవస్థలో అసమానతలను పెంచుతోందని విమర్శించారు. నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తమిళనాడులో ద్విభాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు.

వివరాలు

కరూర్ తొక్కిసలాట ఘటన నన్ను కలచివేసింది

ఎన్నికల ప్రచారం సమయంలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనను కూడా విజయ్ గుర్తుచేశారు. ఆ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. 'ఆ విషాదం నాకు ఎంత బాధ కలిగించిందో మాటల్లో చెప్పలేను. ఆ ఘటన తాలూకు వేదన జీవితాంతం నాతోనే ఉంటుంది. అయితే ఆ దుర్ఘటన విషయంలో కూడా మాపైనే ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని అనిపించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు

వారసత్వ రాజకీయాలపై పరోక్ష విమర్శలు

ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాల అంశాన్ని ప్రస్తావించిన విజయ్, డీఎంకేను ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు. 'ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం మా రాజకీయ సిద్ధాంతం కాదు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవ చేయడమే మా లక్ష్యం. అదే మా రాజకీయ తత్వం, అదే మా పాలనా విధానమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని, రాష్ట్ర ప్రజల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు.

Advertisement