భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. '21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం' అనే అంశంపై కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్‌లోని ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.
భారత ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణం ప్రమాదంలో పడిందన్నారు. తనపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్‌ను తన ఫోన్‌లోకి జొప్పించారని ధ్వజమెత్తారు.
తన కాల్‌లు రికార్డ్ అవుతున్నందున ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించారని రాహుల్ పేర్కొన్నారు. తన లాగే చాలా మంది రాజకీయ నాయకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
రాహుల్
పార్లమెంట్, పత్రిక, న్యాయవ్యవస్థపై ఆంక్షలు: రాహుల్
దేశంలో పార్లమెంట్, పత్రిక, న్యాయవ్యవస్థపై ఆంక్షలు విధిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అయితే తాము భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడిని ధీటుగా ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
రాజ్యాంగంలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా అభివర్ణించారని రాహుల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో యూనియన్‌లో చర్చలు అనేవి చాలా కీలకమన్నారు. అయితే ఇప్పుడు అలాంటి చర్చలు లేకుండా దాడులు, బెదరింపులు ఎక్కువయ్యాయని రాహుల్ ఆరోపించారు.
మైనార్టీలు, పత్రికా వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి ప్రపంచం మొత్తం చూసినట్లు ఈ సందర్భంగా బీబీసీ డాక్యుమెంటరీ అంశాన్ని పరోక్షంగా రాహుల్ ప్రస్తావించారు.