
Ajit Krishnan: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు.. గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌నువెనక్కి పిలిపించిన వాయుసేన
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడికి దిగాయి.
ఈ సందర్భంగా భారీ స్థాయిలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేశారు. సరిహద్దులు దాటి 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన భారత బలగాలు, మొత్తం తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేశాయి.
దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఇలా పహల్గాం దాడికి సమర్థవంతమైన ప్రతీకారం తీర్చినప్పటికీ, భారత్ తన బాధ్యతను మరచిపోలేదు.
పాక్ సైనిక స్థావరాలపై గానీ,అక్కడి పౌరుల నివాసాలపై గానీ ఎలాంటి దాడులు జరగలేదు.
ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని,మిగతా ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది.
వివరాలు
గగన్‌యాన్ ప్రాజెక్టు నుంచి అజిత్ కృష్ణన్ కి పిలుపు
అంతర్జాతీయంగా ఉగ్రవాదం వ్యతిరేకంగా ఉన్న భారత వైఖరికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
పాకిస్తాన్‌తో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, భారత గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఎంపికైన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్‌ను వాయుసేన తిరిగి పిలిపించింది.
గగన్‌యాన్.. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రలో పాల్గొననున్న వారిలో అజిత్ కూడా ఒకరు.
తాజాగా ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
"ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) నుంచి నాకు పిలుపొచ్చింది" అని ఆయన వెల్లడించారు.
వివరాలు
గగన్‌యాన్ బృందంలో ఉన్న ఇతరులు
వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, అలాగే వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా.. గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైన వారు.
వీరే స్వదేశీంగా రూపొందించిన అంతరిక్ష నౌక ద్వారా భారత భూభాగం నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి బృందంగా చరిత్రలో నిలవనున్నారు.
ఈ ప్రయాణం 2027లో జరగనుంది. ప్రస్తుతానికి అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్‌లు భారత్‌లో శిక్షణ పొందుతుండగా, శుభాంశు శుక్లా మరియు నాయర్ అమెరికాలో శిక్షణలో ఉన్నారు.
వివరాలు
అజిత్ కృష్ణన్ గురించి..
అజిత్ కృష్ణన్ 2003లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. ప్రస్తుతం వాయుసేనలో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందిస్తున్నారు.
ఆయనకు 2,900 గంటలకు పైగా వివిధ రకాల యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది.
ఇదే సమయంలో, గగన్‌యాన్ బృందంలోని మరో సభ్యుడు శుభాంశు శుక్లా మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు ప్రయాణించనున్నారు.