
IAF: మూడు యుద్ధాల్లో ఉపయోగించిన భారత వైమానిక దళం రన్‌వేను అమ్మేసిన తల్లీకొడుకులు..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్వాతంత్ర్యం అనంతరం మూడు ప్రధాన యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన ఓ రన్‌వే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన విషాదకర ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన ఫిరోజ్‌పుర్ జిల్లాలో చోటుచేసుకున్నఈ సంఘటనకు సంబంధించి 1997లోనే అక్రమాలు ప్రారంభమైనా, అవి ఇటీవలే బయటపడ్డాయి. పాకిస్థాన్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఫట్టూవాలా గ్రామంలో భారత వాయుసేనకు చెందిన ఒక ప్రముఖ రన్‌వే ఉంది. ఈ రన్‌వే 1962లో భారత్-చైనా యుద్ధం సమయంలో,అలాగే 1965,1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో కీలకంగా ఉపయోగపడింది. అయితే దుమినివాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాల్,ఆమె కుమారుడు నవీన్‌చంద్‌లు కొందరు స్థానిక అధికారులతో చేతులు కలిపి,ఈ రన్‌వే భూమిని తమ స్వంతమైనదిగా చూపేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు.
వివరాలు
1997లో ఈ భూమిపై పలువురికి అమ్మకాలు జరిగినట్లు డీడ్లు
వీరే 1997లో ఈ విలువైన భూమిని ఇతరులకు విక్రయించారు. ఈ వ్యవహారాన్ని విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి నిషాన్ సింగ్ గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ, అనేక సంవత్సరాల పాటు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2021లో హల్వార ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కమాండెంట్‌కు, ఫిరోజ్‌పుర్ కమిషనర్‌కు లేఖలు రాసినా పరిస్థితే మారలేదు. దీంతో నిషాన్ సింగ్ చివరికి హైకోర్టును ఆశ్రయించి, సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ తర్వాత దర్యాప్తులో 1997లో ఈ భూమిపై పలువురికి అమ్మకాలు జరిగినట్లు డీడ్లు ఉన్నాయి. కానీ, ఈ భూమిపై ఎక్కడా భారత వాయుసేన పేరేమీ లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.
వివరాలు
నిందితులుగా ఉషా అన్సాల్, నవీన్‌చంద్
దీంతో 2025 మేలో న్యాయస్థానం ఈ భూమిని రక్షణశాఖకు తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అంతేగాక, విజిలెన్స్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. విజిలెన్స్ బ్యూరో చేసిన విచారణలో ఒక కీలక అంశం బయటపడింది. బ్రిటిష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో, 1945 మార్చి 12న ఈ భూమిని తీసుకొని వాయుసేనకు అప్పగించిందని తేలింది. అప్పటి నుంచి ఈ స్థలం వాయుసేన ఆధీనంలోనే ఉందని అధికారులు నిర్ధారించారు. తాజాగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఉషా అన్సాల్, నవీన్‌చంద్‌లను నిందితులుగా పేర్కొన్నారు.