High Speed Trains: 280 kmph వేగంతో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్న ICF : రైల్వే మంత్రి
చెన్నైలోని సమీకృత రైలుపెట్టెల తయారీ కర్మాగారంలో గంటకు 280 కి.మీ.వేగంతో నడిచే హైస్పీడ్ రైళ్లను రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒక్కో రైల్వే పెట్టె తయారీకి సుమారు రూ.28 కోట్ల ఖర్చు వస్తుందని వివరించారు. బుధవారం లోక్‌సభలో మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వందేభారత్ రైళ్ల విజయంతో,ఇప్పుడు హైస్పీడ్ రైళ్ల రూపకల్పన,తయారీపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ రైళ్లకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మెరుగైన ఛైర్‌కార్‌లు,గాలి చొరబడని నిర్మాణం, అత్యుత్తమ ఏసీ సదుపాయాలు,మరింత ప్రకాశవంతమైన వాతావరణం ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆటోమేటిక్ తలుపులు,ఉష్ణోగ్రత నియంత్రణ,సీసీటీవీ కెమెరాలు,మొబైల్ ఛార్జింగ్,అగ్నిమాపక పరికరాలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
తగ్గిన రైలు ప్రమాదాలు
రైళ్ల నమూనాలు ఖరారైన తర్వాత వాటి అందుబాటుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని మంత్రి తెలిపారు. అలాగే, ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తున్నదని, సముద్ర గర్భంలో 21 కి.మీ. సొరంగ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించారు. 2014-15లో 135 రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2023-24లో ఆ సంఖ్య 40కి తగ్గిందని మంత్రి వెల్లడించారు. రైలు ప్రయాణికుల బీమా పథకంలో, 2019 నవంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు పరిహారానికి ఎలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపారు. అదే కాలంలో రైలు ప్రమాదాల కారణంగా రూ.313 కోట్ల నష్టం జరిగిందని వివరించారు.
ప్రయాణికుల కోసం మెరుగైన సదుపాయాలు
ఏసీ ప్రయాణికుల కోసం ఇచ్చే ఉన్ని రగ్గులను నెలకొకసారి శుభ్రపరుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రగ్గులను కప్పుకొనే ముందు మరో బెడ్‌షీట్‌ను బెడ్‌రోల్ కిట్‌లో అందిస్తున్నామని తెలిపారు. పరిశుభ్రతను పెంచడానికి ప్రామాణిక యంత్రాలను, నిర్దేశిత రసాయనాలను ఉపయోగిస్తున్నామని, వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.