Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా
లోక్‌సభలో కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2023పై చర్చ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ తప్పిదాల వల్లే పీఓకే సమస్య ఏర్పడిందని విమర్శలు గుప్పిచారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు పెద్ద తప్పులు జరిగాయని, దాని వల్ల కశ్మీర్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కాల్పుల విరమణ ప్రకటించడం, కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం అనేవి నెహ్రూ చేసిన తప్పులని పేర్కొన్నారు. కాల్పుల విరమణ మూడు రోజులు ఆలస్యమై ఉంటే, పీఓకే సమస్య ఉండేది కాదన్నారు. అలాగే దేశ అంతర్గత సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం కూడా ఇది పెద్ద తప్పు అన్నారు.
పీఓకే కూడా మనదే, అందుకే అక్కడ 24 సీట్లు రిజర్వ్ చేశాం: అమిత్ షా
లోక్‌సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం లోక్‌సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేయడంపై అమిత్ షా స్పందించారు. 'మీకు కోపం వస్తే నా మీద కాదు నెహ్రూ మీద కోపం తెచ్చుకోండి' అని పేర్కొన్నారు. నూతన చట్టాల వల్ల జమ్ములో గతంలో 37సీట్లు ఉంటే ఇప్పుడు 43కు పెరిగినట్లు వివరించారు. కశ్మీర్‌లో ఇంతకుముందు 46సీట్లు ఉంటే.. ఇప్పుడు 47సీట్లు పెరిగాయన్నారు. పీఓకే కూడా మనదే అని అందుకే అక్కడ కూడా 24సీట్లు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్నారు.