Cyclone Montha: ఏపీలోని ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. బయటకు రావొద్దు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరగడంతో 'మొంథా తుపాన్'గా మారి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాన్, గత ఆరు గంటల్లో గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశలో కదిలింది. ప్రస్తుతం ఇది మచిలీపట్నం నుంచి 280 కి.మీ, కాకినాడ నుంచి 360 కి.మీ, విశాఖపట్నం నుంచి 410 కి.మీ దూరంలో ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని అధికారుల సూచన.
వివరాలు
మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం
కాపులుప్పాడలో 125 మి.మీ., విశాఖ రూరల్‌లో 120 మి.మీ., అనంతపురంలో 117 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు, మొత్తం 86 ప్రాంతాల్లో భారీ వర్షాలు రికార్డయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మొంథా తుఫాన్ మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పరిసరాల్లో ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తుఫాన్ తీరం దాటవచ్చని, ఈ సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. తుఫాన్ ప్రభావం కారణంగా తీర ప్రాంత జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించి ఇళ్లలో సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
వివరాలు
పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం
మొంథా తుఫాన్ 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2,194 రిలీఫ్ క్యాంపులను సిద్ధంగా ఉంచారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం ఉండొచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' అలర్ట్ ఇచ్చారు.
వివరాలు
యానాంలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం రాష్ట్రంలోని 17 జిల్లాలకు 'రెడ్ అలర్ట్', ఐదు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్', నాలుగు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు.
వివరాలు
1,000 ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కలిసి పరిస్థితిని సమీక్షించారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు తెగిపోవడం వంటి ఘటనల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనికి ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1,000 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో మొత్తం 12,000 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
వివరాలు
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: చంద్రబాబు
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.