IMD: రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
తెలంగాణ (Telangana) లో రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సీయస్ పెరిగే అవకాశమున్నట్లు హైదరాబాద్ (Hyderabad)వాతావరణశాఖ హెచ్చరించింది. బుధ, గురు, శుక్ర వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో వడగాల్పులు వీచినట్లు తెలుస్తోంది. గురువారం కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, న ల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ వరకు మరో ద్రోణి కొనసాగుతుంది
కాగా, దక్షిణ విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఇక మన్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ వరకు మరో ద్రోణి కొనసాగుతుందని వివరించింది. వీటి ఫలితంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.