ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍లో 122కు చేరిన మృతులు
నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. జులై 21 వరకు పలు రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, మంగళవారం మరో వాయుగుండం ఏర్పడనుంది. దీని వల్ల భారీ వర్షాలు కురుస్తాయని, మధ్య భారతం, ద్వీపకల్ప ప్రాంతాలు వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడుతాయని ఐఎండీ తెలిపింది.
మహారాష్ట్రలోని పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ
మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో రాయ్‌గఢ్, పూణే జిల్లాల్లో జులై 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పాల్ఘర్, థానే, ముంబై, సింధుదుర్గ్, జల్గావ్, కొల్హాపూర్, సతారా, ఔరంగాబాద్, జల్నా, అకోలాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దిల్లీలో మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి యమునా నీటి మట్టం 205.71 మీటర్లకు చేరుకుంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వరదల కారణంగా 122 మంది ప్రాణాలు కోల్పోయారు.
డెహ్రాడూన్‌లో ఎల్లో అలర్ట్ జారీ
అదేవిధంగా, తూర్పు రాజస్థాన్‌లో జూలై 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్‌లలో జులై 17, 18 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ తదితర జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. కుమావోన్ ప్రాంతంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్ సహా గర్వాల్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరో 5రోజుల పాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. జులై 18, 19లో అండమాన్, నికోబార్ దీవులలోనూ వర్షాలు పడనున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఈశాన్య భారతంలో మురో మూడు రోజులు భారీ వర్షాలు
గోవా, కొంకణ్‌లలో మంగళవారం నుంచి రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో జూలై 18 నుంచి 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. గుజరాత్‌లో జులై 19 నుంచి 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. వచ్చే మూడు రోజుల్లో అసోం, మేఘాలయ, త్రిపురలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జూలై 21 వరకు కర్ణాటకలోని తీరప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరుగా వర్షాలు కురవనున్నాయి.